కెనడాలో ఆకలిని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న రెజీనా అనే స్వచ్ఛంద సంస్థ వినూత్నమైన సేవా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ సంస్థ ప్రత్యేక ‘ఫ్రీ సూపర్ మార్కెట్లు’ ఏర్పాటు చేసింది. వీటిలో లభించే నిత్యావసర వస్తువులు అందరికీ పూర్తిగా ఉచితం. తక్కువ ఆదాయం కలిగిన ఉద్యోగస్తులు, విద్యార్థులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు, వృద్ధులు ఇలా ఎవరైనా ముందుగా రిజిస్ట్రేషన్ చేస్తే ఈ సూపర్ మార్కెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పత్రాలతో సులభంగా నమోదు చేసుకుని, అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే విధానంలోనే ఉచితంగా తీసుకెళ్లే వీలుంటుంది.
ప్రతి రిజిస్ట్రేషన్‌దారు నెలకు దాదాపు రూ.40 వేల విలువైన నిత్యావసరాలు పొందొచ్చు. ఇందులో పాలు, కూరగాయలు, ధాన్యాలు, స్నాన సామగ్రి, శిశు అవసరాలు, మహిళల అవసర వస్తువులు తదితర విభాగాలన్నీ ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారింది. ముఖ్యంగా విద్యార్థులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత, ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులు ఈ సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏ వస్తువుకైనా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు నెలకు పెద్ద మొత్తంలో ఖర్చు ఆదా చేసుకుంటున్నాయి.
ఈ సూపర్ మార్కెట్లతో పాటు, రెజీనా సంస్థ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఫుడ్ బ్యాంకులను కూడా నిర్వహిస్తోంది. ఒక్క ఈ సంస్థే 700కి పైగా ఫుడ్ బ్యాంకులను నడుపుతోంది. వీటికి అదనంగా ప్రభుత్వ, ఇతర స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ఫుడ్ బ్యాంకులను కూడా కలుపుకుంటే కెనడాలో మొత్తం 5,500కి పైగా ఫుడ్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఆహారం దొరక్క ఆకలితో బాధపడే వారు ఒక్కరూ ఉండకూడదనే లక్ష్యంతో ఈ బ్యాంకులు ఉచిత ఆహారం, రేషన్ సామాగ్రిని అందిస్తున్నాయి. చాలా చోట్ల వండిన భోజనాన్ని కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
అదే సమయంలో కెనడాలోని అనేక సాల్వేషన్ ఆర్మీ కేంద్రాలు కూడా సామూహిక భోజన కార్యక్రమాలు, ఉచిత రేషన్ పంపిణీ వంటి సేవలను నిర్వహిస్తున్నాయి. ఈ ఫుడ్ బ్యాంకులు, సూపర్ మార్కెట్లు కలిసి దేశంలో పేదరికాన్ని గణనీయంగా తగ్గించడమే కాక, ఆర్థిక సంక్షోభంలో ఉన్న వేల మంది ప్రజలకు బతుకుదెరువు కల్పిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా ఉచిత ఆహార పంపిణీ చేసే దేశాల్లో కెనడా ముందంజలో నిలవడానికి ఈ సంస్థల సేవలు ముఖ్య కారణమని అక్కడి అధికారులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.