స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసపూరిత తంతును ప్రారంభించారు. “మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే యోనో యాప్ బ్లాక్ అవుతుంది” అంటూ నకిలీ మెసేజ్‌లు భారీగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ సందేశాల్లో ఒక లింక్‌ను పంపిస్తూ, దానిపై క్లిక్ చేస్తే ఏపీకే (APK) ఫైల్ డౌన్‌లోడ్ అవుతుందని, దానిని ఇన్‌స్టాల్ చేసి తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలని బాధితులకు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తిగా మోసపూరితమని, ఖాతాదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం దొంగిలించడమే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఒక్కసారి ఆ నకిలీ APK ఫైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే, ఫోన్‌లోని బ్యాంకింగ్ డేటా మొత్తం నేరగాళ్లకు చేరిపోవచ్చు. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ వివరాలు, యూపీఐ పిన్ వంటి కీలక సమాచారం ఈ యాప్ ద్వారా సైబర్ ముఠాలు సేకరిస్తాయి. క్షణాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ కావడం, అనుమతిలేని లావాదేవీలు జరగడం వంటి భయంకర పరిణామాలు సంభవించవచ్చు. ఇటీవలి రోజుల్లో వాట్సాప్, సోషల్ మీడియాలో ఈ నకిలీ మెసేజ్‌లు విపరీతంగా షేర్ అవుతుండటంతో, అనేక మంది ఈ మోసానికి బలవుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్ బృందం అధికారికంగా స్పందించి హెచ్చరిక జారీ చేసింది. “ఇవి పూర్తిగా నకిలీ సందేశాలు. ఎస్‌బీఐ గానీ, ఇతర బ్యాంకులు గానీ యాప్ అప్‌డేట్‌లు పంపేందుకు ఎప్పుడూ APK ఫైళ్లు షేర్ చేయవు” అని ప్రజలకు స్పష్టం చేసింది. ఎస్‌బీఐ కూడా తమ ఖాతాదారులకు సూచిస్తూ, ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎప్పుడూ క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. “క్లిక్ చేసే ముందు ఆలోచించండి. నకిలీ లింకులు మీ సొమ్మును దోచేసే మార్గాలు అవుతాయి” అని బ్యాంక్ స్పష్టం చేసింది.
ఖాతాదారులు ఇలాంటి మోసాల నుండి కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకింగ్ యాప్‌లు ఎల్లప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేయాలి. అపరిచితుల నుంచి వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. అనుమానాస్పద సందేశాలు వస్తే phishing@sbi.co.in కు మెయిల్ చేయాలి లేదా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి. ఆధార్ అప్‌డేట్ చేయాలంటే, UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా సర్టిఫైడ్ సేవా కేంద్రాలను మాత్రమే ఉపయోగించాలి. డిజిటల్ సర్వీసులు విస్తరిస్తున్న తరుణంలో, ఇటువంటి మోసాలపై మరింత అప్రమత్తత అవసరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.