ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన, సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు చాట్ జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించవద్దని స్పష్టంగా ఆదేశించింది. ఏఐ టూల్స్ వినియోగం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు లీక్ అయ్యే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి సున్నితమైన సమాచారం అనుకోకుండా ఇతర దేశాల చేతికి చేరే అవకాశముందని భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పుగా మారే పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ తమ విధులకు సంబంధించిన సమాచారాన్ని ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయకూడదని ప్రభుత్వం కఠినంగా పేర్కొంది. ఒకసారి సమాచారం ఏఐ టూల్స్‌లో నమోదు చేస్తే, అది ఎక్కడ నిల్వ అవుతుంది? ఎవరి చేతికి చేరుతుంది? అనే అంశాలపై స్పష్టత లేదని కేంద్రం తెలిపింది. ఈ సమాచారాన్ని ఏఐ సంస్థలు ఇతర దేశాలకు షేర్ చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఇలా జరిగితే దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు, చేపట్టబోయే అభివృద్ధి పనులు వంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ముందే బయటపడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇది జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని కేంద్రం మరోసారి గుర్తు చేసింది. భద్రతా ప్రమాణాలను పాటించకుండా ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం వల్ల అనుకోని సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించింది. అందుకే ప్రభుత్వ సమాచారాన్ని తయారు చేయడానికి, విశ్లేషించడానికి లేదా నిర్ణయాల రూపకల్పనకు ఏఐ టూల్స్‌ను వినియోగించకుండా ఉండటమే మంచిదని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే తగిన నియంత్రణ చర్యలు చేపడుతున్నామని, అవసరమైతే మరిన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు, ఏఐ టూల్స్ వల్ల వ్యక్తిగత సమాచారం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా సమాచారం కోసం మనం వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు లేదా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తే, అవి భవిష్యత్తులో మెరుగైన సేవల కోసం ఏఐ సంస్థల డేటాబేస్‌లో భద్రపరచబడతాయని వారు చెబుతున్నారు. దీని వల్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ వివరాలు, ఆర్థిక సమాచారం, గుర్తింపు పత్రాలు వంటి సున్నితమైన వివరాలను ఏఐ టూల్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.