ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సిబ్బంది సంక్షేమం దిశగా మరో కీలక అడుగు పడింది. పోలీస్ ఉద్యోగులకు అందించే సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘APOLIS’ (Automated Police Online Information System) అనే నూతన వ్యవస్థను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ కొత్త విధానం అమల్లోకి రావడంతో ఇప్పటివరకు మూడు నెలల పాటు పడుతున్న సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియ ఇప్పుడు కేవలం ఒక్క రోజులోనే పూర్తయ్యేలా మారింది. పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఆలస్యాలు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులకు చెక్ పెట్టడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా రూపొందించారు.
‘APOLIS’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్వయంగా ఒక పోలీస్ ఉద్యోగికి తన కుమార్తె వివాహ అవసరాల కోసం రూ.3 లక్షల సంక్షేమ రుణాన్ని కొత్త విధానం ద్వారా తక్షణమే మంజూరు చేసి విడుదల చేశారు. అవసరమైన పత్రాలన్నీ డిజిటల్ విధానంలో పరిశీలించిన తర్వాత, దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే రుణం మంజూరు అయ్యేలా ఈ వ్యవస్థను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా పోలీస్ సిబ్బందికి అత్యవసర సమయాల్లో ఆర్థిక సహాయం వేగంగా అందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
పోలీసు శాఖలో పరిపాలనా వ్యవహారాలను మరింత సులభతరం చేయడంతో పాటు, కాగిత రహిత పాలనను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ‘APOLIS’ ఈఆర్‌పీ (ERP) ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినట్లు డీజీపీ తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి బెటాలియన్లు, యూనిట్ కార్యాలయాల వరకు పోలీసు శాఖలోని అన్ని విభాగాలను ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పరిధిలోకి తీసుకురానున్నారు. భవిష్యత్తులో పోలీసు శాఖలో నిర్ణయాలను మరింత సమర్థవంతంగా తీసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) టెక్నాలజీలను కూడా ఈ వ్యవస్థకు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ‘APOLIS’ మొబైల్ యాప్‌ను కూడా డీజీపీ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా పోలీస్ సిబ్బంది సంక్షేమ రుణాలు, సెలవుల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా పే-స్లిప్స్, మెడికల్ రిపోర్టులు, పోలీస్ శాలరీ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ ఎన్. మధుసూదన్ రెడ్డి, ఐజీపీ సిహెచ్. శ్రీకాంత్, డీఐజీ అన్బు రాజన్‌తో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొని ఈ డిజిటల్ మార్పును అభినందించారు.