బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు వేదిక సిద్ధమైంది. డిసెంబర్ 21, ఆదివారం రాత్రి జరగనున్న ఫైనల్ ఎపిసోడ్‌తో ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్, స్టేజ్ డిజైన్, షూటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సీజన్ మొత్తం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపిన బిగ్‌బాస్ షో చివరి ఘట్టానికి చేరుకోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. విజేత ఎవరో తెలుసుకోవడమే కాదు, ఫినాలేకు వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరోనన్న అంశంపై కూడా సోషల్ మీడియాలో భారీ చర్చ కొనసాగుతోంది.
గత కొన్ని సీజన్లుగా బిగ్‌బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరవుతుండటం ఆనవాయితీగా మారింది. అయితే గతేడాది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఫినాలేకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశారు. దీంతో ఈసారి కూడా చిరంజీవే ఫినాలేకు వస్తారని చాలామంది అభిమానులు భావించారు. ఇదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు కూడా చీఫ్ గెస్ట్ లిస్ట్‌లో వినిపించింది. ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా బిగ్‌బాస్ వేదికపై డార్లింగ్ సందడి చేస్తాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం చిరంజీవి, ప్రభాస్ ఇద్దరూ ఈసారి బిగ్‌బాస్ 9 గ్రాండ్ ఫినాలేకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. చిరంజీవి తన ప్రస్తుత ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పాటు ప్రభాస్ కూడా సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఫినాలేకు రావడం కుదరలేదని టాక్. దీంతో బిగ్‌బాస్ టీమ్ చివరి నిమిషంలో మరో స్టార్ హీరోను సంప్రదించినట్టు సమాచారం. ఆయన ఎవరో కాదు మాస్ మహారాజ రవితేజ. చిరంజీవి రాక ఖరారు కాకపోవడంతో రవితేజను సంప్రదించగా, ఆయన కూడా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రవితేజ ‘భర్త మహశయులకు విజ్ఞప్తి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ వేదికపై హాజరైతే సినిమా ప్రమోషన్ కూడా ఒకేసారి జరిగిపోతుందన్న ఆలోచనతో రవితేజ ఆసక్తి చూపినట్టు టాక్. బిగ్‌బాస్ 9 గ్రాండ్ ఫినాలేకు మాస్ మహారాజ చీఫ్ గెస్టుగా రాబోతున్నాడన్న వార్తతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన స్టేజ్‌పై చేసే ఎంట్రీ, మాట్లాడే డైలాగ్స్, కంటెస్టెంట్స్‌తో ఇంటరాక్షన్ షోకి అదనపు హైలైట్ అవుతాయని బిగ్‌బాస్ ప్రేక్షకులు ఆశిస్తున్నారు.