ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (బీసీ) కుటుంబాలకు సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీకి తోడు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేల ఆర్థిక సహాయం అందించనుంది. దీని ద్వారా బీసీ వర్గాలకు మొత్తం రూ.80 వేల వరకు రాయితీ లభించనుంది. ఈ నిర్ణయంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయం సౌరశక్తిని వినియోగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు సోలార్ విద్యుత్‌కు ఎంతో ఉపయోగకరమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందుకే సామాజిక వర్గాల వారీగా ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ప్రజలను సోలరైజేషన్ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం 3 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే సుమారు రూ.2.20 లక్షలు ఖర్చవుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తోంది. బీసీ వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేలు ఇవ్వడంతో మొత్తం సహాయం రూ.80 వేల వరకు చేరుతుంది. మిగిలిన రూ.1.42 లక్షల కోసం బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మరింత మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తోంది ప్రభుత్వం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద రెండు కిలోవాట్ల సోలార్ యూనిట్లను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. దీంతో విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 100 శాతం సోలరైజేషన్ దిశగా పనులు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే 6 లక్షల మందికి పైగా గృహ వినియోగదారులు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ బిల్లులపై భారీగా ఆదా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధంగా గృహాలు, కార్యాలయాలు, గ్రామాలన్నింటినీ సౌరశక్తితో స్వయం సమృద్ధిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు అమలు చేస్తోంది.