సామాన్య ప్రజల పౌష్టికాహారంలో ప్రధాన స్థానం దక్కించుకున్న కోడిగుడ్డు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ ఆహార పదార్థం ఇప్పుడు వినియోగదారులకు భారంగా మారింది. గతంలో రిటైల్ మార్కెట్‌లో ఒక్క గుడ్డు ధర రూ.5 నుంచి రూ.6 మధ్యే ఉండేది. అయితే, ప్రస్తుతం అదే గుడ్డు రూ.8 వరకు చేరడంతో మధ్యతరగతి కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, హోల్‌సేల్ మార్కెట్‌లోనే గుడ్డు ధర రూ.7.30 పైగా పలుకుతోంది. ఇది పౌల్ట్రీ పరిశ్రమ చరిత్రలోనే ఎప్పుడూ లేని రికార్డు స్థాయి ధరగా వ్యాపారులు చెబుతున్నారు.
ధరల పెరుగుదల ట్రే స్థాయిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు 30 గుడ్లు ఉన్న ట్రే ధర హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.160 నుంచి రూ.170 మధ్య ఉండగా, ఇప్పుడు అదే ట్రే ధర రూ.210 నుంచి రూ.220 వరకు చేరింది. రిటైల్ మార్కెట్‌లో అయితే ఇది ఇంకా ఎక్కువగా ఉంది. మరోవైపు, నాటు కోడిగుడ్ల ధర మరింత షాక్ ఇస్తోంది. ఒక్కో నాటు గుడ్డు రూ.15 వరకు విక్రయించడంతో గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు కూడా ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలు రోజువారీ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.
ఈ అకస్మిక ధరల పెరుగుదలకు ప్రధాన కారణం గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గడమేనని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగేది. అయితే, ఇటీవల కాలంలో కోళ్లకు అవసరమైన దాణా, మక్కలు, చేపపొట్టు వంటి ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఉత్పత్తి ఖర్చులు భరించలేక చాలా మంది రైతులు పౌల్ట్రీ ఫారాల నిర్వహణను నిలిపివేశారు. ఫలితంగా మార్కెట్‌లో సరఫరా తగ్గి, డిమాండ్ ఎక్కువవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ప్రస్తుత పరిస్థితులపై పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ప్రస్తుతం హోల్‌సేల్‌లో రూ.7.30, రిటైల్‌లో రూ.8 ధర పలకడం పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్ టైమ్ హై. కనీసం మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు” అని ఒక గుడ్ల వ్యాపారి తెలిపారు. ఉత్పత్తి మళ్లీ సాధారణ స్థాయికి చేరేవరకు ధరలు తగ్గే అవకాశాలు తక్కువేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ముడిసరుకుల ధరల నియంత్రణ, రైతులకు సాయంపై దృష్టి పెట్టితేనే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.