టెక్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరో అరుదైన రికార్డు సృష్టించారు. 700 బిలియన్ డాలర్లకు పైగా నికర సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారు. టెస్లా సంస్థకు సంబంధించిన కీలక కోర్టు తీర్పు మస్క్‌కు అనుకూలంగా రావడంతో ఆయన సంపద ఒక్కసారిగా భారీగా పెరిగింది.
టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి ప్రముఖ సంస్థల అధినేత అయిన ఎలాన్ మస్క్ నికర సంపద ప్రస్తుతం సుమారు 749 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా. 2018లో టెస్లా మస్క్‌కు ఇచ్చిన పారితోషిక ప్యాకేజీపై ఇటీవల డెలావేర్ సుప్రీం కోర్టు అనుకూల తీర్పు ఇవ్వడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.
2018లో టెస్లా బోర్డు మస్క్‌కు భారీ స్టాక్ ఆప్షన్‌ల రూపంలో పారితోషికం ఇవ్వడానికి అంగీకరించింది. అప్పట్లో ఈ ప్యాకేజీ విలువ సుమారు 56 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అయితే దీనిపై ఒక షేర్‌హోల్డర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో, కింది కోర్టు ఈ ప్యాకేజీని చెల్లదని ప్రకటించింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ మస్క్ పైకోర్టును ఆశ్రయించారు. 2024లో టెస్లా షేర్‌హోల్డర్లు మళ్లీ ఈ పారితోషిక ప్యాకేజీకి ఆమోదం తెలిపిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్యాకేజీని రద్దు చేస్తే తాను గత ఆరేళ్లుగా చేసిన కృషి వృథా అవుతుందని మస్క్ వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న డెలావేర్ సుప్రీం కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
ఇక టెస్లా సంస్థ భవిష్యత్ పనితీరు ఆధారంగా మస్క్‌కు ఇంకా భారీ పారితోషికం చెల్లించేందుకు బోర్డు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఏఐ, రోబోటిక్స్, మార్కెట్ వృద్ధిలో నిర్దిష్ట లక్ష్యాలు చేరుకుంటే గరిష్ఠంగా ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మస్క్ తర్వాతి స్థానంలో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నికర సంపద సుమారు 500 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడుతోంది.