Budget Travel: అమెరికా వంటి దేశాల్లో సామాన్యుడి బతుకు భారంగా మారుతున్న వేళ, ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రం చాలా తక్కువ ధరకే అద్భుతమైన జీవనశైలిని అందిస్తున్నాయి. చైనా నుండి లావోస్ వరకు ఉన్న ఆ టాప్ దేశాల మీకోసం..
చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. కానీ ధరలు మాత్రం జుజుబీ!
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అక్కడ ఉత్పత్తి రంగం ఎంత బలంగా ఉందంటే, కేవలం $1.50 సుమారు 125 రూపాయలు కే ఇద్దరు వ్యక్తులు కడుపునిండా తినొచ్చు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, అక్కడ కొన్ని నగరాల్లో ఇళ్ల ధరలు. డిమాండ్ లేక ఖాళీగా ఉన్న సుమారు 5 కోట్ల ఇళ్ల వల్ల, కొన్ని పాత అపార్ట్‌మెంట్‌లు కేవలం $40 3,300 రూపాయలు కే దొరుకుతున్నాయి. అంటే ఒక వాడిన ఎయిర్‌పాడ్స్ ధర కంటే తక్కువకే అక్కడ సొంత ఇల్లు కొనుక్కోవచ్చు! అయితే, అక్కడ పెళ్లి చేసుకోవడం మాత్రం చాలా ఖరీదైన వ్యవహారం సుమీ.
కాంబోడియా: అమెరికన్ డాలర్ల రాజ్యమే ఇక్కడ!
సందర్శకులకు కాంబోడియా ఒక స్వర్గధామం. ఇక్కడ అధికారిక కరెన్సీ కాకపోయినా, అమెరికన్ డాలర్లు యథేచ్ఛగా చెల్లుతాయి. కేవలం $7 తో ఒక నెల మొత్తం సరిపోయే డేటా సిమ్ కార్డు దొరుకుతుంది. సముద్రపు ఆహారం ఇక్కడ చాలా చౌక. $8 కే కిలో పీతలు దొరుకుతాయి. ఇక రాత్రిపూట వినోదం కోసం పబ్ స్ట్రీట్‌కు వెళ్తే, కేవలం 60-70 రూపాయలకే బీర్ దొరుకుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 'కోయూన్' అనే వింత వాహనాలపై జనం ప్రయాణిస్తుంటారు, ఇది అక్కడి అచ్చమైన జీవన చిత్రానికి అద్దం పడుతుంది.
ఉజ్బెకిస్థాన్ బంగారు గనులున్నా.. ఖర్చు మాత్రం తక్కువే!
మధ్య ఆసియాలోని ఈ దేశం అద్భుతమైన నిర్మాణాలకు పెట్టింది పేరు. ఇక్కడ 100 డాలర్లు మారిస్తే మీరు అక్కడి కరెన్సీలో లక్షాధికారి అయిపోతారు. తాష్కెంట్ మెట్రో స్టేషన్లు చూస్తే ఏదో అండర్ గ్రౌండ్ రాజభవనంలో ఉన్నట్లు ఉంటుంది. కానీ అక్కడ ప్రయాణ ఛార్జీ కేవలం 15-20 పైసలే (డాలర్లలో). ఇక్కడి ప్రత్యేక వంటకం 'ప్లోవ్' (Plov) ను భారీ కడాయిల్లో వండుతారు. ఒక్కసారి తింటే రోజంతా ఆకలి వేయదు, దీని ధర కేవలం $2.50 మాత్రమే.
ఇండోనేషియా: బాలిలో విలాసవంతమైన విల్లాలు
డిజిటల్ నోమాడ్స్ (ల్యాప్‌టాప్‌తో ఎక్కడైనా పని చేసేవారు) కోసం ఇండోనేషియా ప్రాణం పోస్తుంది. ముఖ్యంగా బాలిలో నెలకు కేవలం 40 వేల రూపాయలకే సొంత స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఉన్న విలాసవంతమైన విల్లాను అద్దెకు తీసుకోవచ్చు. అమెరికాలో ఈ ధరకి పార్కింగ్ స్థలం కూడా రాదు. రోడ్డు పక్కన ఉండే 'వరుంగ్' అనే హోటళ్లలో నాసి గోరెంగ్ వంటి రుచికరమైన భోజనం కేవలం 120 రూపాయలకే దొరుకుతుంది.
మలేషియా & ఫిలిప్పీన్స్: ఆధునికతతో కూడిన పొదుపు
మలేషియాలో రోడ్డు మౌలిక సదుపాయాలు అమెరికాతో సమానంగా ఉన్నా, పెట్రోల్ ధరలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల చాలా తక్కువ. $1.50 తో అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు. ఇక ఫిలిప్పీన్స్ విషయానికొస్తే, ఇక్కడ భాషా సమస్య అస్సలు ఉండదు. అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. అక్కడి 'జీప్నీ' (Jeepneys) వాహనాల్లో ప్రయాణం చాలా సరదాగా, చౌకగా ఉంటుంది. అక్కడ మద్యం ధరలు పండ్ల రసం కంటే తక్కువగా ఉండటం విశేషం.
చివరిగా లావోస్ వంటి దేశాలు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా, చాలా తక్కువ ఖర్చుతో బతకడానికి వీలు కల్పిస్తున్నాయి. అమెరికాలో ఆర్థిక ఒత్తిడితో సతమతమయ్యే వారికి ఈ దేశాలు ఒక కొత్త ఆశను ఇస్తున్నాయి.