Indigo: 80 ఏళ్ల వృద్ధురాలికి విమాన ప్రయాణంలో అసౌకర్యం.. ఇండిగోకు రూ.50 వేల జరిమానా!

Indigo: వయసు, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రీమియం సీటును మార్చి ఇబ్బందులకు గురిచేసినందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు కర్ణాటక రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. 80 ఏళ్ల వృద్ధురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించడంతో పాటు న్యాయ ఖర్చుల కోసం మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది

Indigo
Indigo

ప్రీమియం సీటు మార్చిన ఇండిగోకు షాక్.. వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు..

వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోని ఎయిర్లైన్స్పై చర్యలు..

బెంగళూరు: వయసు, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రీమియం సీటును మార్చి ఇబ్బందులకు గురిచేసినందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు కర్ణాటక రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. 80 ఏళ్ల వృద్ధురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించడంతో పాటు న్యాయ ఖర్చుల కోసం మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది.

బెంగళూరుకు చెందిన అన్సూ ఏ అమిన్ అనే వృద్ధురాలు 2023 డిసెంబర్లో బెంగళూరు నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు ఇండిగో విమాన టికెట్ బుక్ చేసుకున్నారు. ఆమెకు రెండు శస్త్రచికిత్సలు జరగడంతో ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీల్చైర్ సదుపాయం, ఎక్కువ స్థలం ఉండే ప్రీమియం ఫ్రంట్ రో సీటును ప్రత్యేకంగా కోరారు.

ఆమె అభ్యర్థనను అంగీకరించిన ఇండిగో సంస్థ మొదటి వరుసలోని 1బీ సీటును కేటాయించింది. ఇందుకోసం అదనపు ఛార్జీలతో కలిపి రూ.13,906 చెల్లించారు. సౌకర్యవంతమైన ప్రయాణం ఉంటుందని భావించిన ఆమె విమానాశ్రయానికి చేరుకోగా, చివరి నిమిషంలో సీటు మార్చినట్లు సిబ్బంది తెలిపారు.

ఆమెకు కేటాయించిన మొదటి వరుస సీటు బదులుగా 28వ వరుసలోని 28బీ మధ్య సీటును ఇచ్చారు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, మరో అవకాశం లేదని సిబ్బంది చెప్పడంతో అదే సీటులో ప్రయాణించాల్సి వచ్చింది.

మధ్య సీటులో కూర్చోవడం వల్ల కాళ్లు చాపుకునే అవకాశం లేకపోవడం, కదలికలకు ఇబ్బంది కలగడంతో పాటు వెన్ను, కాళ్ల నొప్పులు తీవ్రంగా ఎదురయ్యాయని వృద్ధురాలు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. సీటు మార్పు విధానం వల్ల తనకు శారీరక ఇబ్బందులతో పాటు మానసిక వేదన కూడా కలిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో ఇండిగో సంస్థ ప్రీమియం సీటు బుక్ చేసిన విషయం నిజమేనని అంగీకరించింది. అయితే, ఆ విమానంలో ఆడిట్ నిర్వహించే సిబ్బందికి మొదటి వరుసలో ఒక సీటు కేటాయించాల్సి రావడంతో సీటు మార్చామని వివరణ ఇచ్చింది.

అయితే, ప్రయాణికురాలి వయసు, ఆరోగ్య పరిస్థితి తెలిసినప్పటికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా సీటు మార్చడం సేవల్లో లోపమేనని రాష్ట్ర కమిషన్ స్పష్టం చేసింది. ఆమె ప్రీమియం సీటును కేవలం సౌకర్యం కోసం కాకుండా ఆరోగ్య కారణాలతో తీసుకున్నారని పేర్కొంది.

కర్ణాటక రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సభ్యులు రవి శంకర్, సునీత సీ బాగేవాడి విచారణ జరిపి, జిల్లా కమిషన్ గతంలో ఇచ్చిన రూ.8 వేల పరిహారాన్ని తగినంత కాదని అభిప్రాయపడ్డారు. వృద్ధురాలు ఎదుర్కొన్న శారీరక బాధ, మానసిక ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని పరిహారాన్ని రూ.50 వేలకు పెంచారు. ఇండిగో సంస్థ 30 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని, ఆలస్యం అయితే సంవత్సరానికి 6 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించారు.

ఈ తీర్పు ద్వారా వృద్ధులు, దివ్యాంగులు లేదా ఆరోగ్య కారణాలతో ప్రత్యేక సదుపాయాలు కోరే ప్రయాణికుల విషయంలో విమాన సంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కమిషన్ స్పష్టం చేసింది. అదనపు చార్జీలు చెల్లించి పొందిన సౌకర్యాలను ఎలాంటి కారణం లేకుండా చివరి నిమిషంలో మార్చడం సరైన విధానం కాదని ఈ తీర్పు సూచించింది.

Be the first to react

Latest