Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక అదనపు లగేజీ బుకింగ్ ఆన్‌లైన్‌లోనే.. జూలై 31 నుంచి ఐఆర్‌సీటీసీ కొత్త సేవలు

Railways: భారతీయ రైల్వే ప్రయాణికులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై కన్ఫర్మ్‌డ్ రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులు తమ అదనపు వ్యక్తిగత లగేజీని ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ కొత్త సేవ జూలై 31 నుంచి ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.

Railway Luggage
Railway Luggage

IRCTC కొత్త సేవ.. అదనపు లగేజీని ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి..

జూలై 31 నుంచి కొత్త రూల్.. రైలులో అదనపు లగేజీ బుకింగ్‌కు ఆన్‌లైన్ సౌకర్యం..

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై కన్ఫర్మ్‌డ్ రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులు తమ అదనపు వ్యక్తిగత లగేజీని ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ కొత్త సేవ జూలై 31 నుంచి ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఉచిత పరిమితిని మించిన లగేజీ తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా రైల్వే స్టేషన్‌లోని పార్సెల్ కార్యాలయానికి వెళ్లి బుకింగ్ చేయాల్సి ఉండేది. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు.

ఈ కొత్త సదుపాయం కేవలం కన్ఫర్మ్‌డ్ రిజర్వేషన్ టికెట్ కలిగిన ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. రిజర్వ్ చేసిన కోచ్‌లో తీసుకెళ్లే వ్యక్తిగత లగేజీకి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. రైల్వే నిర్దేశించిన బరువు పరిమితికి మించి లగేజీ ఉంటే, టికెట్ బుక్ చేసే సమయంలోనే దానిని ఆన్‌లైన్‌లో ప్రకటించి బుక్ చేసుకోవచ్చు.

టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులకు తరగతి వారీగా ఉచిత లగేజీ పరిమితి, గరిష్టంగా అనుమతించే బరువు, నిషేధిత వస్తువుల జాబితా, అదనపు చార్జీలు, జరిమానా నిబంధనలు వంటి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఈ కొత్త విధానంతో అదనపు లగేజీ కోసం ప్రత్యేకంగా పార్సెల్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. రైల్వే సమాచార వ్యవస్థ (CRIS) సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పూర్తి చేయడంతో ఈ సేవను అమలు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రయాణికులు ప్రయాణించే తరగతిని బట్టి ఉచితంగా తీసుకెళ్లే లగేజీ పరిమితి ఇలా ఉంటుంది.
ఏసీ ఫస్ట్ క్లాస్: 70 కిలోల వరకు ఉచితం. అదనపు చార్జీలతో గరిష్టంగా 150 కిలోల వరకు అనుమతి.
ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టియర్: 50 కిలోల వరకు ఉచితం. చార్జీలు చెల్లించి 100 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.
స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకు ఉచితం. అదనపు చార్జీలతో 80 కిలోల వరకు అనుమతి.
సెకండ్ క్లాస్: 35 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 70 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.
ఏసీ 3-టియర్, ఏసీ 3 ఎకానమీ, ఏసీ చెయిర్ కార్: గరిష్టంగా 40 కిలోల వరకు మాత్రమే అనుమతి. ఈ తరగతుల్లో ఉచిత పరిమితి, గరిష్ట పరిమితి ఒకటే కావడంతో సాధారణంగా అదనపు లగేజీ బుకింగ్‌కు అవకాశం ఉండదు.
కోచ్‌లో తీసుకెళ్లే లగేజీ పరిమాణం కూడా నిర్ణయం

లగేజీ బరువుతో పాటు దాని పరిమాణంపైనా రైల్వే స్పష్టమైన నిబంధనలు తీసుకొచ్చింది. 
ఏసీ 3-టియర్, ఏసీ 3 ఎకానమీ, ఏసీ చెయిర్ కార్: 55 సెం.మీ × 45 సెం.మీ × 22.5 సెం.మీ.
ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టియర్, స్లీపర్, జనరల్ క్లాస్: 100 సెం.మీ × 60 సెం.మీ × 25 సెం.మీ. 

ఉచిత పరిమితిని మించిన లగేజీపై సాధారణ లగేజీ రేటుకు 1.5 రెట్లు చార్జీ వసూలు చేస్తారు. కనీస చార్జీ రూ.30గా నిర్ణయించారు. చార్జీలను ప్రతి 10 కిలోల స్లాబ్ ప్రకారం లెక్కిస్తారు. కనీస ప్రయాణ దూరాన్ని 50 కిలోమీటర్లుగా పరిగణిస్తారు.

ప్రయాణికులు భారతీయ రైల్వే పార్సెల్ పోర్టల్లో నమోదు చేసుకుని లాగిన్ కావాలి. అనంతరం బయలుదేరే స్టేషన్, గమ్యస్థానం, రైలు వివరాలను ఎంపిక చేసి ఈ-ఫార్వార్డింగ్ నోట్ను పూర్తి చేయాలి. అంచనా రవాణా చార్జీలు కూడా అక్కడే కనిపిస్తాయి.

ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఈ-ఫార్వార్డింగ్ నోట్ ప్రింట్ తీసుకుని బయలుదేరే స్టేషన్‌లో లగేజీని అప్పగించాలి. అక్కడ లగేజీ బరువు కొలిచి తుది చార్జీలు నిర్ణయిస్తారు. చెల్లింపు అనంతరం రైల్వే రసీదు (Railway Receipt - RR) జారీ చేస్తారు.

లగేజీ పంపిన తర్వాత ప్రయాణికులు ట్రాక్ అండ్ ట్రేస్ సేవ ద్వారా దాని స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. లగేజీ గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే ఎస్‌ఎంఎస్ అలర్ట్ కూడా వస్తుంది. అనంతరం అసలు రైల్వే రసీదు చూపించి డెలివరీ కౌంటర్ వద్ద లగేజీని తీసుకోవచ్చు.

ఈ కొత్త విధానంతో అదనపు లగేజీ ఉన్న ప్రయాణికులు ఇకపై పార్సెల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, టికెట్ బుకింగ్ దశలోనే లగేజీ వివరాలను నమోదు చేసి ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకునే అవకాశం లభించనుంది. ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు రైల్వే సేవలు మరింత డిజిటల్, పారదర్శకంగా మారనున్నాయి.

Tags

Be the first to react

Latest