V2V Technology: రోడ్డు ప్రమాదాలకు చెక్... వాహనాల కోసం కేంద్రం 'స్మార్ట్' సేఫ్టీ రూల్స్!

V2V Technology: అక్టోబర్ 1, 2027 నుండి కొత్త మోడళ్లలో, అక్టోబర్ 1, 2028 నాటికి దేశంలోని టూ-వీలర్స్, ఫోర్-వీలర్స్ మరియు వాణిజ్య వాహనాలన్నింటిలో ఈ సిస్టమ్ తప్పనిసరి కానుంది...

వెహికల్-టు-వెహికల్' (V2V) కమ్యూనికేషన్
వెహికల్-టు-వెహికల్' (V2V) కమ్యూనికేషన్

ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు...

కార్లు, బైకుల్లో స్మార్ట్ కొలిజన్ అలర్ట్ డివైజెస్...

కేంద్రం ప్రతిపాదనలు ఇవే...


V2V Technology: దేశంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు, ప్రయాణికుల భద్రతను పెంపొందించేందుకు 'వెహికల్-టు-వెహికల్' (V2V) కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా రోడ్డుపై ప్రయాణించే వాహనాలు పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ ప్రమాదాల బారిన పడకుండా డ్రైవర్లను ముందుగానే హెచ్చరిస్తాయి.

దశలవారీగా V2V అమలు

కేంద్రం విడుదల చేసిన ప్రతిపాదన ప్రకారం, ఈ అత్యాధునిక V2V కమ్యూనికేషన్ సిస్టమ్‌ను దశలవారీగా భారత ఆటోమొబైల్ రంగానికి పరిచయం చేయనున్నారు.

  • అక్టోబర్ 1, 2027 నుండి: V2V సదుపాయంతో తయారయ్యే కొత్త వాహనాలు తప్పనిసరిగా AIS-230 భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

  • అక్టోబర్ 1, 2028 నుండి: దేశంలో తయారయ్యే L, M, N కేటగిరీలకు చెందిన (టూ-వీలర్స్, ఫోర్-వీలర్స్, కమర్షియల్) అన్ని రకాల మోటారు వాహనాల్లో ఈ వీ2వీ సాంకేతిక వ్యవస్థను అమర్చడం తప్పనిసరి అవుతుంది.

వాహన తయారీ సంస్థలకు తగినంత సమయం ఇచ్చేందుకే ఈ దశలవారీ విధానాన్ని ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

అసలు ఏంటీ 'వీ2వీ' టెక్నాలజీ?

వీ2వీ (Vehicle-to-Vehicle) అనేది స్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీ. దీని ద్వారా సమీపంలో ఉండే వాహనాలు తమ వేగం, ప్రస్తుత స్థానం, ప్రయాణించే దిశ మరియు యాక్సిలరేషన్ వివరాలను నిజసమయంలో (Real-time) ఒకదానికొకటి బదిలీ చేసుకుంటాయి.

  • ముందు వెళ్లే కారు ఒక్కసారిగా అత్యవసర బ్రేక్ వేసినా,

  • అసురక్షితంగా లేన్ మారేందుకు ప్రయత్నించినా,

  • ఎదురుగా వచ్చే వాహనం ప్రమాదకరంగా సమీపిస్తున్నా,

  • బ్లైండ్ స్పాట్స్‌లో లేదా కంటికి కనిపించని దూరంలో వాహనాలు ఉన్నా.. ఈ సిస్టమ్ వెంటనే డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. అంతేకాకుండా అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వంటి అత్యవసర సేవల వాహనాలు దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ముందుగానే డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది.

భద్రతకు కొత్త మైలురాయి

ప్రస్తుతం ఆటోమొబైల్ రంంగంలో ఉన్న అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వ్యవస్థకు ఈ V2V కమ్యూనికేషన్ అదనపు బలాన్ని ఇస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సీ-వి2ఎక్స్ (C-V2X) సాంకేతికత ఆధారంగా 5.875 GHz నుండి 5.925 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పనిచేసే ఈ ఆన్-బోర్డ్ యూనిట్లు రోడ్డు భద్రతలో సరికొత్త విప్లవాన్ని తీసుకురానున్నాయి. ప్రమాద రహిత భారతీయ రహదారుల సాధనకు ఇది కీలక అడుగు కానుంది.

Tags

Be the first to react

Latest