కెనడాలో వెళ్లాలనుకొనే వారికి భారీ శుభవార్త.. వచ్చే ఏడాది 6.57 లక్షల మందికి పీఆర్!

Canada Immigration Policy 2027: విదేశాల్లో స్థిరపడాలని, ముఖ్యంగా కెనడాలో ఉద్యోగాలు చేస్తూ శాశ్వత నివాస హోదా (Permanent Residency – PR) పొందాలని ఆశిస్తున్న వారికి కీలక పరిణామం చోటుచేసుకుంది. కెనడా ప్రభుత్వం తన 2026 బడ్జెట్‌లో భాగంగా కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే ఏడాది శాశ్వత, తాత్కాలిక నివాస హోదాలు కలిపి 10 లక్షలకు పైగా మందికి కల్పించనుంది. ఇప్పటికే కెనడాలో నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న తాత్కాలిక వలసదారుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలకు కూడా శాశ్వత నివాస హోదా కల్పించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Canada Immigration Policy 2027
Canada Immigration Policy 2027

కెనడాలో వలసదారులకు భారీ ఊరట.. వచ్చే ఏడాది 10 లక్షల మందికి పైగా శాశ్వత, తాత్కాలిక నివాస హోదాలు..

కెనడాలో స్థిరపడాలనుకునేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ ప్రకటించిన ప్రభుత్వం..

కెనడా: విదేశాల్లో స్థిరపడాలని, ముఖ్యంగా కెనడాలో ఉద్యోగాలు చేస్తూ శాశ్వత నివాస హోదా (Permanent Residency – PR) పొందాలని ఆశిస్తున్న వారికి కీలక పరిణామం చోటుచేసుకుంది. కెనడా ప్రభుత్వం తన 2026 బడ్జెట్‌లో భాగంగా కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే ఏడాది శాశ్వత, తాత్కాలిక నివాస హోదాలు కలిపి 10 లక్షలకు పైగా మందికి కల్పించనుంది. ఇప్పటికే కెనడాలో నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న తాత్కాలిక వలసదారుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలకు కూడా శాశ్వత నివాస హోదా కల్పించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

కెనడా కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళిక ప్రకారం 2027లో 6,57,250 మందికి శాశ్వత నివాస హోదా కల్పించే అవకాశం ఉంది. అయితే సాధారణ ఇమ్మిగ్రేషన్ కోటా కింద ప్రతి సంవత్సరం 3,80,000 మంది కొత్త శాశ్వత నివాసితులను చేర్చుకోవాలని బడ్జెట్‌లో పేర్కొన్నారు. దీనికి అదనంగా ఇప్పటికే కెనడాలో ఉంటున్న తాత్కాలిక నివాసితులకు ప్రత్యేక పథకాల ద్వారా పీఆర్ కల్పించనున్నారు. మరోవైపు తాత్కాలిక నివాస హోదాల కింద ప్రతి సంవత్సరం 3,70,000 మందిని అనుమతించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం వచ్చే మూడేళ్ల పాటు అమల్లో ఉండనుంది.

వలసలపై పియర్ పోయిలీవ్రే అభ్యంతరం

ప్రభుత్వం ప్రకటించిన వలస విధానంపై కెనడా ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలీవ్రే (Pierre Poilievre) విమర్శలు గుప్పించారు. కెనడా ఇంత పెద్ద సంఖ్యలో కొత్త వలసదారులను స్వీకరించే సామర్థ్యం కలిగి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం అంటారియోలోని బ్రాంప్టన్‌లో మాట్లాడుతూ.. ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు, ఇళ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నంతవరకే వలసలను ప్రోత్సహించాలని అన్నారు. దేశం భరించగలిగే స్థాయికి మించి వలసదారులను తీసుకురావడం సరికాదని వ్యాఖ్యానించారు.

కెనడాలోని యువతకు ఇప్పటికే ఇళ్లు దొరకడం లేదని, ఉద్యోగ అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్నారని పోయిలీవ్రే పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి మార్క్ కార్నీ మరింత మంది తాత్కాలిక విదేశీ ఉద్యోగులను తీసుకురావాలని భావించడం యువతకు సమస్యలను మరింత పెంచుతుందని విమర్శించారు. వలసల విషయంలో దేశ ఆర్థిక, సామాజిక సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వలస విధానాన్ని సమర్థించిన మార్క్ కార్నీ

ప్రతిపక్ష విమర్శలను ప్రధానమంత్రి మార్క్ కార్నీ తోసిపుచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం దేశ దీర్ఘకాలిక అవసరాలకు, స్థిరమైన వలస విధానానికి అనుగుణంగా ఉందని స్పష్టం చేశారు. వలసలపై ప్రభుత్వం తిరిగి నియంత్రణ సాధించిందని పేర్కొన్నారు. 2024 నుంచి కెనడాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 71 శాతం తగ్గిందని, తాత్కాలిక విదేశీ ఉద్యోగుల సంఖ్య 57 శాతం, శరణార్థులుగా ఆశ్రయం కోరుతున్న వారి సంఖ్య 68 శాతం తగ్గిందని బడ్జెట్ గణాంకాలను ప్రస్తావించారు. వలసల సంఖ్యను క్రమబద్ధీకరిస్తూనే దేశానికి అవసరమైన నైపుణ్యం కలిగిన వారిని కొనసాగించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు.

ఇప్పటికే కెనడాలో ఉన్నవారికి పీఆర్ అవకాశం

కొత్త విధానంలో అత్యంత కీలకమైన అంశం ఇప్పటికే కెనడాలో నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న సుమారు 2 లక్షల మంది తాత్కాలిక నివాసితులకు శాశ్వత నివాస హోదా కల్పించాలనే నిర్ణయం. 2027లో సాధారణంగా ప్రకటించిన 3.80 లక్షల పీఆర్ కోటాకు అదనంగా వీరికి అవకాశం కల్పించనున్నారు. వీరిలో సుమారు సగం మందికి ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ (Express Entry), ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (Provincial Nominee Program) ద్వారా పీఆర్ ఇవ్వనున్నారు.

ఈ రెండు మార్గాల ద్వారా నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు శాశ్వత నివాస హోదా లభించనుంది. ఆయా ప్రావిన్సులు తమ ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, కార్మికుల కొరతను బట్టి ఈ గ్రూపులోని అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. స్థానిక పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగులను గుర్తించి పీఆర్ కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కొన్నేళ్లుగా కెనడాలోని ఒకే కంపెనీలో, ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న అనేక మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం వారి యజమానులు తాత్కాలిక వర్క్ పర్మిట్‌ను పునరుద్ధరించుకునే ప్రక్రియను ఎదుర్కొంటున్నారని వివరించారు. ఇలాంటి వారిని కేవలం తాత్కాలిక నివాసితులుగా చూడకుండా, వారి సేవలను గుర్తించి శాశ్వత నివాస హోదా కల్పించడం సరైన నిర్ణయమని కార్నీ అభిప్రాయపడ్డారు.

మానవతా దృక్పథంతో మరో లక్ష మందికి పీఆర్

మిగిలిన మరో లక్ష మందికి మానవతా కారణాలు, కుటుంబ పునరేకీకరణ (Family Reunification) ప్రాతిపదికన శాశ్వత నివాస హోదా ఇవ్వనున్నారు. వీరంతా ఇప్పటికే కెనడాలో నివసిస్తున్నవారే. ప్రస్తుతం వారి దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీరిలో హాంకాంగ్‌కు చెందిన దాదాపు 32,000 మంది, ఉక్రెయిన్‌కు చెందిన సుమారు 19,000 మంది ఉన్నారు.

వీరిలో చాలామంది కెనడాలోనే స్థిరపడి జీవిస్తున్నప్పటికీ, అధికారికంగా తాత్కాలిక నివాస హోదాలో కొనసాగుతున్నారని కార్నీ పేర్కొన్నారు. వాస్తవానికి వారు ఇప్పటికే కెనడా సమాజంలో భాగమయ్యారని, వారి నివాస స్థితికి చట్టబద్ధమైన గుర్తింపు కల్పించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని వివరించారు. తాత్కాలిక నివాసం నుంచి శాశ్వత నివాసానికి మారే ఈ ప్రక్రియకు సహకరించేందుకు 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్ల కాలానికి 302 మిలియన్ కెనడియన్ డాలర్లను కేటాయించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు.

ఇదిలా ఉండగా, గత ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన మరో రెండేళ్ల ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం పూర్తి చేయనుంది. దీని ద్వారా 2027లో అదనంగా దాదాపు 80,000 మందికి శాశ్వత నివాస హోదా కల్పించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం, ఇప్పటికే కెనడాలో ఉన్న 2 లక్షల మందికి పీఆర్ కల్పించే నిర్ణయం కలిపి వచ్చే ఏడాది సాధారణ కోటా కంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించనున్నాయి. ఈ కారణంగానే 2027లో శాశ్వత నివాసితుల సంఖ్య దాదాపు 6.60 లక్షలకు చేరుతోంది.

కెనడా జనాభా పెరుగుదలపై ప్రభుత్వం లెక్కలు

కెనడా జనాభాతో పోలిస్తే కొత్తగా ప్రకటించిన 3.80 లక్షల మంది శాశ్వత నివాసితుల సంఖ్య దాదాపు 0.9 శాతానికి సమానం. అయితే అదనపు పథకాల ద్వారా పీఆర్ పొందే వారిని కూడా కలిపితే ఈ పెరుగుదల దేశ జనాభాలో సుమారు 1.5 శాతానికి చేరుతుంది. గణాంకాల ప్రకారం కెనడాలో 2025లో సుమారు 3,72,000 మంది, 2024లో దాదాపు 3,66,000 మంది జన్మించారు. అంటే ప్రభుత్వం ప్రతిపాదించిన సాధారణ వార్షిక పీఆర్ సంఖ్య దేశంలో ప్రతి సంవత్సరం నమోదవుతున్న జననాల సంఖ్యకు కొద్దిగా ఎక్కువగా ఉంది.

మరోవైపు కెనడాలో మరణాల సంఖ్య జననాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, దానికి చాలా దగ్గరగా ఉంది. 2024లో సుమారు 3,26,000 మంది, 2023లో దాదాపు 3,27,000 మంది మరణించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. జననాలు, మరణాల మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా సహజ జనాభా పెరుగుదల పరిమితంగానే ఉంటోంది.

మొత్తంగా చూస్తే, కెనడా ప్రభుత్వం ఒకవైపు కొత్తగా వచ్చే వలసదారుల సంఖ్యను నియంత్రించేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు ఇప్పటికే దేశంలో నివసిస్తూ పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా కెనడాలో ఏళ్ల తరబడి పనిచేస్తూ పీఆర్ కోసం ఎదురుచూస్తున్న విదేశీయులకు ఈ నిర్ణయం కీలక అవకాశంగా మారనుంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలు, గృహ వసతి, వైద్య సదుపాయాలను ప్రభుత్వం ఎంత సమర్థంగా అందించగలదన్నది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.

Tags

Be the first to react

Latest