ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన నగరాల్లో రోడ్ల అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా, రోడ్ల నిర్మాణం, నిర్వహణ పనులను పీపీపీ (ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం) విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి దశగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మొత్తం 112 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం రూ.478 కోట్ల వ్యయాన్ని అంచనా వేసిన ప్రభుత్వం, త్వరలోనే సంబంధిత పనుల కోసం బిడ్లను ఆహ్వానించనుంది. నాణ్యత, పారదర్శకత, దీర్ఘకాలిక నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ విధానాన్ని ఎంపిక చేసినట్లు పురపాలక శాఖ అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టును ‘యాన్యుటీ మోడల్’ పద్ధతిలో అమలు చేయనున్నారు. ఈ విధానంలో రోడ్ల నిర్మాణం మాత్రమే కాకుండా, నిర్దిష్ట కాలపరిమితి వరకు వాటి నిర్వహణ బాధ్యతను కూడా ప్రైవేట్ సంస్థలే చేపడతాయి. ప్రభుత్వానికి తక్షణ ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, రోడ్ల నాణ్యతపై రాజీ పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మోడల్‌ను ఎంచుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత కంపెనీల పనితీరు ఆధారంగా నిర్ణీత కాల వ్యవధుల్లో వారికి చెల్లింపులు జరుగుతాయి. ఈ విధానం విజయవంతమైతే, రాష్ట్రంలోని ఇతర నగరాలకు కూడా దీనిని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఇటీవలి కాలంలో నగరపాలక సంస్థల్లో కొత్త మున్సిపాల్టీలు, పంచాయతీలు కలవడంతో కొత్త కాలనీలు విస్తరించాయి. అయితే ఈ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత ఎదురవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారులు ప్రతిపాదించిన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టుకు ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించింది. పెద్ద నిర్మాణ సంస్థలు ఈ యాన్యుటీ మోడల్‌పై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టులో భాగంగా కాంట్రాక్ట్ సంస్థలకు తొలి ఏడాదిలో మొత్తం వ్యయంలో 40 శాతం మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన 60 శాతం మొత్తాన్ని తొమ్మిదేళ్ల కాలంలో దశలవారీగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఎస్క్రో ఖాతాలు ఏర్పాటు చేస్తారు. రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌లు, మీడియన్లు, స్ట్రీట్ లైట్లు, వర్షపు నీటి కాలువలు, యుటిలిటీ డక్టులు, సైన్ బోర్డులు, మార్కింగ్‌లు, పార్కింగ్ సదుపాయాలు, హాకర్ జోన్లు, చెత్త బుట్టలు వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. రోడ్లపై గుంతలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేయడం, గ్రీనరీ సంరక్షణ, కాలువల శుభ్రత వంటి బాధ్యతలు కూడా కాంట్రాక్ట్ సంస్థలకే అప్పగించనున్నారు. ఈ విధానం ద్వారా నగరాల్లో రోడ్ల అభివృద్ధి మరింత సమర్థవంతంగా జరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.