Guinness Record: వీపుపై 27 కిలోల బరువుతో గంటలో 847 పుష్‌అప్స్.. గిన్నిస్ రికార్డు సాధించిన ‘పుష్-అప్ మ్యాన్ ఆఫ్ ఇండియా’!

Guinness Record: సాధారణంగా కొద్దిసేపు పుష్‌అప్స్ చేయడమే చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది వీపుపై 27 కిలోలకు పైగా బరువును మోసుకుంటూ గంటపాటు వందల సంఖ్యలో పుష్‌అప్స్ చేయడం అసాధారణమే. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి భారతదేశానికి మరో గిన్నిస్ ప్రపంచ రికార్డును అందించాడు 41 ఏళ్ల రోహ్‌తాష్ చౌదరి.

Push Ups Man of India
Push Ups Man of India

గిన్నిస్ రికార్డు సృష్టించిన ‘పుష్-అప్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రోహ్‌తాష్ చౌదరి..

27 కిలోల బరువుతో గంటలో 847 పుష్-అప్స్.. భారతీయుడి ప్రపంచ రికార్డు..

న్యూఢిల్లీ: సాధారణంగా కొద్దిసేపు పుష్‌అప్స్ చేయడమే చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది వీపుపై 27 కిలోలకు పైగా బరువును మోసుకుంటూ గంటపాటు వందల సంఖ్యలో పుష్‌అప్స్ చేయడం అసాధారణమే. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి భారతదేశానికి మరో గిన్నిస్ ప్రపంచ రికార్డును అందించాడు 41 ఏళ్ల రోహ్‌తాష్ చౌదరి. "పుష్-అప్ మ్యాన్ ఆఫ్ ఇండియా"గా పేరొందిన ఆయన, 27.21 కిలోల (60 పౌండ్లు) బరువున్న బ్యాక్‌ప్యాక్‌ను వీపుపై మోసుకుని ఒక గంటలో ఏకంగా 847 పుష్‌అప్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ రికార్డు నమోదు చేశారు. పరిమిత సంఖ్యలో ప్రేక్షకులు హాజరైనప్పటికీ వారి హర్షధ్వానాల మధ్య రోహ్‌తాష్ చౌదరి అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ ఘనతతో 2023లో సిరియాకు చెందిన సామి జోమా హసన్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును అధిగమించారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో రోహ్‌తాష్ భారీ బ్యాక్‌ప్యాక్‌తో వేదికపైకి వచ్చి, క్రమశిక్షణతో ఒక్కో పుష్‌అప్ పూర్తి చేస్తుండగా అధికారులు ప్రతి ప్రయత్నాన్ని లెక్కించిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

ఈ చారిత్రక ఘట్టానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. రికార్డు పూర్తైన అనంతరం గిన్నిస్ అధికార ప్రతినిధి ఐనీ తూరాబల్లితో కలిసి రోహ్‌తాష్ చౌదరికి అధికారిక గిన్నిస్ ప్రపంచ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు.

రికార్డు అనంతరం స్పందించిన రోహ్‌తాష్ చౌదరి, "రికార్డులు బద్దలు కొట్టడానికే కాదు... మనిషి సామర్థ్యాలకు హద్దులు లేవని ప్రపంచానికి గుర్తు చేయడానికి కూడా ఉంటాయి. మనపై మనకు నమ్మకం ఉండి, నిరంతర కృషి చేస్తే అసాధ్యాన్ని కూడా సాధించవచ్చు" అని చెప్పారు.

ఈ రికార్డు కోసం రోహ్‌తాష్ నెలల తరబడి కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజామున బరువులతో కూడిన పుష్‌అప్ సెట్లను సాధన చేయడంతో పాటు, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా తాను సిద్ధం కావడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

రోహ్‌తాష్ ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది. ఒకప్పుడు ఆయన తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురై దాదాపు రెండేళ్ల పాటు శరీరాన్ని కదిలించలేని స్థితికి చేరుకున్నారు. అయితే నిరాశ చెందకుండా పునరావాస చికిత్సను కొనసాగించి, క్రమంగా తిరిగి కోలుకున్నారు. అనంతరం తన జీవితాన్నే ఫిట్‌నెస్‌కు అంకితం చేస్తూ వరుసగా ప్రపంచ రికార్డులపై దృష్టి పెట్టారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఈ ఏడాదితో రోహ్‌తాష్ వరుసగా ప్రపంచ రికార్డుల కోసం ప్రయత్నించడం ప్రారంభించి పదేళ్లు పూర్తయ్యాయి.

ప్రస్తుతం కూడా రోహ్‌తాష్ ప్రతిరోజూ ఎలాంటి విరామం లేకుండా సాధన కొనసాగిస్తున్నారు. తన పరిమితులను మరింత అధిగమించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా యువతలో శారీరక దృఢత్వం, వ్యాయామం పట్ల ఆసక్తిని పెంచాలని ఆయన భావిస్తున్నారు.

అదే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఫిట్ ఇండియా మూవ్‌మెంట్'కు ఆయన అంబాసిడర్‌గా కూడా సేవలందిస్తున్నారు. కష్టాలను అవకాశాలుగా మార్చుకుంటే విజయాలు సాధ్యమేనని రోహ్‌తాష్ చౌదరి జీవితం మరోసారి నిరూపించింది.

Be the first to react

Latest