వేడి అన్నంలో కలిపి తింటే అద్భుతమైన రుచిని ఇచ్చే వంటల్లో వెల్లుల్లి గుడ్డు కారం ఒకటి. దీన్ని కేవలం 10 నిమిషాల్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చుననేది దీని ప్రత్యేకత. పెద్దలు, చిన్న పిల్లలు అందరూ ఇష్టపడే ఈ డిష్ నోటికే రుచిగా ఉండటంతో పాటు భోజనంలో ఒక మంచి సైడ్ డిష్‌గా నిలుస్తుంది. కొద్దిపాటి పదార్థాలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచి వచ్చేస్తుంది.
ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్. కోడిగుడ్లు, కారం (సుమారు 2 టేబుల్ స్పూన్లు), వెల్లుల్లి, జీలకర్ర, నూనె, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, తగినంత ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర తరుగు ఉంటే చాలు. ముందుగా తయారీ కోసం వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి. కారం, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్రను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేస్తే వెల్లుల్లి ప్రత్యేక సువాసన వచ్చేలా కారం సిద్ధమవుతుంది.
తరువాత స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి తాలింపు చేయాలి. అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి ఉప్పు, పసుపు, కరివేపాకు కలిపి బాగా ముదురుగా వేగించాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారిన తర్వాత వాటిని పాన్ అంచులవైపు జరపాలి. ఇప్పుడు పాన్ మధ్యలో నూనె కనిపిస్తుంది.
అందులో కోడిగుడ్లను నేరుగా పగులగొట్టి వేసి లైట్‌గా కలిపి మూతపెట్టి ఉడికించాలి. గుడ్లు బాగా ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి, తిరిగి ఉల్లిపాయలతో కలిపి వేగించాలి. గుడ్డు ముక్కలకు ఎర్రటి రంగు వచ్చి రోస్ట్ అవుతున్నట్టు కనిపించినప్పుడు గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారం వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. దీని వల్ల వెల్లుల్లి కారం మొత్తం గుడ్లలో చొరబడి అద్భుతమైన రుచి వస్తుంది.
చివరిగా కొత్తిమీర తరుగు వేసి ఒకసారి బాగా కలిపితే వెల్లుల్లి గుడ్డు కారం రెడీ అయిపోతుంది. వేడి అన్నంపై వేసుకుని తింటే భలే రుచి ఉంటుంది. దీన్ని రోటీ, చపాతీతో కూడా సైడ్ డిష్‌గా వడ్డించవచ్చు. కొద్దిసమయంలో, తక్కువ ఖర్చుతో రెస్టారెంట్ స్థాయి రుచి కావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ రెసిపీ.