బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. ఎన్నికల పరాజయానికి కారణాలపై జరిగిన సమీక్షా సమావేశమే ఈ విభేదాలకు బీజం అయినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో తేజస్వీ యాదవ్ ఆయన సోదరి రోహిణి ఆచార్య మధ్య తీవ్రమైన మాటల ఘర్షణ చోటుచేసుకొని, చివరకు కుటుంబ బంధాలను కూడా కుదిపేసే స్థాయికి చేరినట్లు విశ్వసనీయ వర్గాలు వివరిస్తున్నాయి.
సభలో రోహిణి పార్టీ సమస్యలపై కొన్ని సూచనలు చేస్తుండగా తేజస్వీ వాటిని పూర్తిగా తిరస్కరించి, ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆమెనే కారణమని తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలతో రోహిణి తీవ్రంగా కలచిపోయారని, ఆగ్రహావేశంలో తేజస్వీ చెప్పు విసిరినట్లే మరికొన్ని వర్గాలు చెబుతుండటం పరిస్థితులు ఎంత దారుణంగా మారాయో స్పష్టంగా అర్థమవుతుంది. రోహిణి తన మీద పడిన ఈ అవమానాన్ని తట్టుకోలేక వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కుటుంబంలో మరింత కలకలం రేపింది.
రోహిణి ఎక్స్‌లో చేసిన ట్వీట్ చాలా స్పష్టంగా ఉంది. ఆమె కేవలం పార్టీని విడిచిపెట్టడమే కాదు, కుటుంబం నుంచి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం తేజస్వీకి అత్యంత సన్నిహితుడైన రమీజ్ నెమత్ ఖాన్, అలాగే పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సంజయ్ యాదవ్ అని ఆమె ఆరోపించడం అంతర్గత రాజకీయాల్లో ఉన్న ఒత్తిళ్లను బయటపెట్టింది.
అసలు ఈ వివాదాలు ఒక్కసారిగా ఉద్భవించినవి కావు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనే తేజస్వీ, రోహిణి మధ్య చిన్నపాటి విభేదాలు మొదలయ్యాయి. పార్టీ ఆదేశాల మేరకు రోహిణి సింగపూర్ నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొన్నా, ఆమెకు కోరుకున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు అవకాశం ఇవ్వలేదని అప్పట్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. సారన్ నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తర్వాత పార్టీలోని కొందరు ఆమెను లక్ష్యంగా చేసుకోడం సమస్యలను మరింత పెంచినట్లు సన్నిహిత వర్గాలు వివరిస్తున్నాయి.
ఇప్పుడీ ఘర్షణలు కుటుంబ రాజకీయ వారసత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. లాలూ యాదవ్ కుటుంబం అనేక సంవత్సరాలుగా ఆర్జేడీ రాజకీయాలకు ఆధారం. కానీ ఇప్పుడు పిల్లల మధ్య పెరుగుతున్న అంతర్గత విభేదాలు పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా రోహిణి వంటి కీలక వ్యక్తి కుటుంబం, పార్టీని దూరం చేసుకోవడం ఆర్జేడీకి మానసికంగా భారీ దెబ్బగానే భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో లాలూ కుటుంబం ఎలా ముందుకు సాగుతుంది? విభేదాలను తగ్గించే ప్రయత్నం జరుగుతుందా? లేక ఈ చీలికలు మరింత పెరిగి రాజకీయంగా కొత్త పరిణామాలకు దారితీస్తాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో చర్చకు వస్తున్నాయి. కుటుంబ అంతర్గత తగాదాలు రాజకీయ పార్టీలను ఎంతగా ప్రభావితం చేస్తాయో చూపించే ఉదాహరణగా ఈ సంఘటన నిలిచిపోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.