చాలామంది భావించేలా క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉన్నప్పుడే లోన్ ఈజీగా అప్రూవ్ అవుతుందని నిజమే. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే, స్కోర్ బాగున్నా కూడా కొన్నిసార్లు బ్యాంకులు లోన్‌ను రిజెక్ట్ చేస్తుంటాయి. ఇది కేవలం స్కోర్ మీదే ఆధారపడి ఉండదు. మీ ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థిరత్వం, ఇప్పటికే ఉన్న అప్పులు వంటి పలు అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి.
క్రెడిట్ స్కోర్ అనేది వ్యక్తి అప్పు తీర్చే పద్ధతిని, ఆర్థిక అలవాట్లను సూచించే ముఖ్యమైన సూచిక. ఎటువంటి లోన్ తీసుకున్నా దాన్ని సమయానికి చెల్లించడం, క్రెడిట్ కార్డ్ బిల్లులను టైంలో కట్టడం వంటి మంచి ఆర్థిక అలవాట్లు స్కోర్‌ను పెంచుతాయి. అదే, ఆలస్యంగా చెల్లించడం, చాలా ఎక్కువ లోన్‌లకు అప్లై చేయడం, ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేయడం వంటివి స్కోర్‌ను తగ్గిస్తాయి. అందుకే స్కోర్ మంచిదే అయినా, బ్యాంకులు ఇతర అంశాలను కూడా పరిశీలిస్తాయి.
ఉద్యోగం కూడా లోన్ అప్రూవల్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు తరచుగా ఉద్యోగాలు మారుతున్నారా లేదా స్థిరమైన ఉద్యోగం ఉందా అన్నది బ్యాంకులు చెక్ చేస్తాయి. ఉద్యోగం స్థిరంగా లేకపోతే, స్కోర్ బాగున్నా కూడా లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఉద్యోగం స్టేబుల్‌గా ఉండటం, అదే రంగంలో ఎక్కువకాలం పనిచేస్తుండటం బ్యాంకులకు నమ్మకాన్ని ఇస్తాయి.
ఇప్పటికే మీపై ఉన్న అప్పు భారమూ చాలా పెద్ద కారణం. మీ ఆదాయంలో 40–50% వరకు ఇప్పటికే EMIలకే వెళ్లిపోతున్నట్లయితే, బ్యాంకులు మిమ్మల్ని రిస్క్‌గా భావించి కొత్త లోన్ ఇవ్వడానికి వెనుకాడవచ్చు. అలాగే చాలా క్రెడిట్ కార్డులు ఉండటం లేదా అనేక ప్లాట్‌ఫారమ్‌లలో తరచూ లోన్‌కు అప్లై చేయడం కూడా బ్యాంకులకు మీరు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు అనిపిస్తుంది.
మొదటిసారి లోన్ తీసుకునేవారికి మాత్రం క్రెడిట్ స్కోర్ నిబంధన వర్తించదు. బ్యాంకులు వారి ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం వంటి ఇతర కారకాలను చూసి నిర్ణయం తీసుకుంటాయి. మొత్తం మీద, క్రెడిట్ స్కోర్ ఎంత బాగున్నా కూడా లోన్ అప్రూవ్ అవ్వడానికి ఉద్యోగం, అప్పు భారం, ఆర్థిక ప్రవర్తన వంటి పలు కారణాలు ప్రభావితం చేస్తాయి.