Egg Masala Recipe: కోడిగుడ్డు కూర అంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా, కాస్త వెరైటీగా డాబా స్టైల్‌లో ఉండాలంటే ఈ పెప్పర్ ఎగ్ మసాలా ది బెస్ట్ ఆప్షన్. ఇది చపాతీ, బిర్యానీ లేదా వేడి అన్నం.. దేనిలోకైనా అదిరిపోతుంది. అసలు ఎక్కువ గరం మసాలాలు వాడకుండానే, ఇంట్లో ఉండే మిరియాలు, సోంపు వంటి దినుసులతో ఈ కర్రీని ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా ఈజీగా చేసేలా ఉండే ఈ రెసిపీ టెక్స్చర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది, ఇది ఎంత రుచిగా ఉంటుందో. ముక్క విరగకుండా, మసాలా లోపలి దాకా వెళ్లి భలే స్పైసీగా ఉంటుంది.
ముందుగా ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు పెంకు ఊడి రాకపోతే చాలా చిరాకు వస్తుంది కదా, దానికి ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఎప్పుడూ ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే గుడ్లను ఉడకబెట్టకూడదు, అవి రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. మరుగుతున్న నీళ్లలో కొంచెం ఉప్పు, ఒక నిమ్మచెక్క రసాన్ని తొక్కతో సహా వేస్తే, ఆ పెంకు కింద ఉండే పొర తెల్లసొనకి అంటుకోకుండా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. కేవలం పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించి, వెంటనే చల్లటి నీళ్లలో వేసి పెంకు తీసేసి, గుడ్లను సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఈ కర్రీకి అసలైన రుచి మనం చేసుకునే మిరియాల పొడిలోనే ఉంది. మిక్సీ జార్‌లో మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే గ్రేవీ కోసం టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, పెరుగు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో కొంచెం బటర్ వేసి, కట్ చేసిన గుడ్లను బోర్లించి పెట్టి, వాటిపై కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, మనం కొట్టుకున్న మసాలా పొడి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి రెండు వైపులా ఎర్రగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
కూర కోసం కడాయిలో నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీకి అంత చిక్కదనం వస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయాక, మనం గ్రైండ్ చేసుకున్న టమాటా-పెరుగు పేస్ట్ కూడా వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇందులో పసుపు, ఉప్పు, గరం మసాలా మిగిలిన మిరియాల పొడి వేసి కలిపి, తగినన్ని నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద గ్రేవీని దగ్గర పడనివ్వాలి.
గ్రేవీ ఉడుకుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేసి, పైన కొద్దిగా కసూరి మేతి, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర చల్లుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత మరీ ఎక్కువ సేపు ఉడికించాల్సిన పనిలేదు, జస్ట్ రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేస్తే చాలు. గుడ్లకు మసాలా అంతా పట్టి, భలే రుచిగా తయారవుతుంది. అంతే, ఎంతో స్పెషల్‌గా ఉండే డాబా స్టైల్ పెప్పర్ ఎగ్ మసాలా రెడీ అయిపోయినట్లే. ఈ సండే మీ ఇంట్లో ఇది తప్పకుండా ట్రై చేయండి..