Pawan Kalyan: ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను.. వీరాభిమాని నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర భావోద్వేగం!

Pawan Kalyan: జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని, తెలంగాణలోని హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ నిన్న రాత్రి కన్నుమూశాడు. ఈ వార్త తెలియగానే పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను..
ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను..
  • చిన్నారి మనల్ని విడిచి వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన..

  • అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ చిన్నారి నిరంజన్ మృతి..

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్ల అమితమైన భక్తిని, అభిమానాన్ని చాటుకున్న తెలంగాణలోని హనుమకొండకు చెందిన 17 ఏళ్ల విద్యార్థి పొనుగంటి నిరంజన్ అరుదైన, ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచాడు. గత కొంతకాలంగా మంచానికే పరిమితమై, అత్యంత క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితుల నడుమ మృత్యువుతో పోరాడిన ఈ చిన్నారి మరణవార్త తెలియగానే పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు లోనయ్యారు.

తన ప్రాణసమానుడైన వీరాభిమాని ఇక లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన జనసేనాని సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిరంజన్ను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిరంజన్ భౌతికంగా మనల్ని విడిచివెళ్లడం తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని, కొద్దిరోజుల క్రితమే హనుమకొండలోని వారి నివాసానికి స్వయంగా వెళ్లి ఆ చిన్నారిని, వారి కుటుంబ సభ్యులను కలిసిన క్షణాలు ఇంకా తన కళ్లముందే కదలాడుతున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

అంతటి భయంకరమైన అనారోగ్య బాధను అనుభవిస్తూ కూడా, తనను చూడగానే ఆ చిన్నారి ముఖంలో విరిసిన చిరునవ్వు, ఆ కళ్లల్లో కనిపించిన ఆనందం ఎప్పటికీ మరువలేని ఒక మధుర జ్ఞాపకమని సాదరంగా స్మరించుకున్నారు. శరీరం వ్యాధితో రోజురోజుకూ క్షీణిస్తున్నప్పటికీ, ఆ చిన్నారి మనసు నిండా కొండంత ధైర్యం, అపారమైన ఆత్మవిశ్వాసం కనిపించాయని, అంతటి ధైర్యశాలి ఇంత త్వరగా అనంతలోకాలకు వెళ్లిపోతాడని ఊహించలేకపోయాానని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంజన్ తనపై చూపిన అపారమైన ప్రేమ తన గుండెల్లో ఎప్పటికీ సజీవంగా నిలిచిపోతుందంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంటతడి పెట్టారు.

గత నెలలోనే నిరంజన్ ఎదుర్కొంటున్న అరుదైన అనారోగ్య సమస్యల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్ కల్యాణ్, ఎంతో బిజీగా ఉన్న తన రాజకీయ షెడ్యూల్ను సైతం పక్కనబెట్టి స్వయంగా తెలంగాణలోని హనుమకొండకు వెళ్లి ఆ బాలుడిని పరామర్శించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ పరామర్శ సమయంలో నిరంజన్ను ఎంతో ప్రేమగా తన గుండెలకు హత్తుకుని, తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదాన్ని అందించి, ఆ బాలుడి కోరిక మేరకు కలిసి సెల్ఫీలు కూడా దిగారు.

ఆ భేటీ సందర్భంగా తనకు ఆడుకోవడానికి ఒక మంచి కుక్కపిల్ల (Puppy) కావాలని నిరంజన్ అడగ్గానే, పవన్ కల్యాణ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రోజే ప్రత్యేకంగా ఒక ముద్దుల కుక్కపిల్లను ఆ బాలుడి ఇంటికి పంపించి సర్ప్రైజ్ చేశారు. అంతేకాకుండా, తాను భవిష్యత్తులో నిర్మించబోయే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఓజీ 2' (OG 2) షూటింగ్ లేదా ప్రివ్యూ పూర్తి కాగానే, అందులో నువ్వే నా ప్రత్యేక అతిథివి (Special Guest) అని, ఇద్దరం పక్కపక్కనే కూర్చుని ఆ సినిమా చూద్దామంటూ నిరంజన్కు పవన్ కల్యాణ్ నాడు నమ్మకంగా మాట ఇచ్చారు. 

కానీ, ఆ సినిమా చూసే భాగ్యం లేకుండానే ఆ చిన్నారి కన్నుమూయడంతో అటు జనసేన శ్రేణులు, ఇటు పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బాలీవుడ్ ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ సైతం నిరంజన్ మరణవార్త విని కలత చెందారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా వీడియో కాల్ (Video Call) చేసిన సోనూ సూద్, వారిని పరామర్శించి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆ చిన్నారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి తానున్నానంటూ కొండంత ధైర్యాన్ని, భరోసాను అందించి మరోసారి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు.

Tags

Be the first to react

Latest