West Bengal: తృణమూల్ కాంగ్రెస్ ఆర్థిక లావాదేవీలపై ఈడీ సోదాలు.. కోల్కతాలో ఐదు చోట్ల తనిఖీలు!

West Bengal: తృణమూల్ కాంగ్రెస్ (AITC)కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కోల్కతా నగరం, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది.

ED Raids
ED Raids

టీఎంసీ నిధుల వ్యవహారంపై ఈడీ దర్యాప్తు.. విమానయాన సంస్థల్లో సోదాలు..

రూ.160 కోట్ల లావాదేవీలు ఈడీ విచారణలో.. తృణమూల్ కాంగ్రెస్పై దర్యాప్తు ముమ్మరం..

కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (AITC)కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కోల్కతా నగరం, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది.

ఈ సోదాలు విమానయాన రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేర్వెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఆ సంస్థ డైరెక్టర్లు, అలాగే ఒక ఎన్నికల ట్రస్ట్కు సంబంధించిన కార్యాలయాల్లో జరిగాయి. తృణమూల్ కాంగ్రెస్ ఖాతాల నుంచి జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, అక్రమంగా నిధుల సేకరణ, బ్యాంకు ఖాతాల ద్వారా నిధుల మళ్లింపుపై దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈడీ ప్రాథమిక విచారణ ప్రకారం, విమానయాన, ట్రావెల్ సంస్థల ద్వారా రూ.150 కోట్లకు పైగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. 2023 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు తృణమూల్ కాంగ్రెస్ ఖాతాల నుంచి సుమారు రూ.160 కోట్లు ప్రైవేట్ విమానయాన సంస్థకు, దానికి అనుబంధ సంస్థకు బదిలీ అయినట్లు వెల్లడించింది.

ఆ తర్వాత అదే సంస్థ రూ.82 కోట్లకు పైగా మొత్తాన్ని మరో కొత్త అనుబంధ సంస్థకు బదిలీ చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ నిధులతో ఎంబ్రాయర్ లెగసీ 600 విమానం, అగస్టా 109 ఎస్పీ హెలికాప్టర్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపింది. ఈ కొనుగోళ్ల కోసం మొత్తం రూ.112 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.

అగస్టా హెలికాప్టర్ కొనుగోలులో కొంత విదేశీ నిధులు వినియోగించినట్లు, మిగిలిన ఎక్కువ మొత్తాన్ని నేరుగా తృణమూల్ కాంగ్రెస్ ఖాతాల నుంచే సమకూర్చినట్లు ఈడీ ఆరోపించింది.

విచారణలో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చినట్లు ఈడీ తెలిపింది. పార్టీ నిధులతో కొనుగోలు చేసిన విమానం, హెలికాప్టర్ను తిరిగి తృణమూల్ కాంగ్రెస్కే అద్దెకు ఇచ్చినట్లు గుర్తించామని పేర్కొంది. వాటి వినియోగం పేరుతో పార్టీ నుంచి మరోసారి భారీ మొత్తాలు చెల్లించినట్లు వెల్లడించింది.

ఈ మొత్తం లావాదేవీల విధానం అనుమానాస్పదంగా ఉందని, అసలు నిధుల వినియోగ ఉద్దేశాన్ని దాచిపెట్టేందుకు ఈ వ్యవహారం జరిగినట్లు కనిపిస్తోందని ఈడీ అభిప్రాయపడింది. ఈ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Be the first to react

Latest