Greenfield Express Highway: ఏపీలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే! రూ.4,600 కోట్లతో... ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు!
Greenfield Express Highway: ఈ హైవే మొత్తం 162 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైంది. ఇందులో 106 కిలోమీటర్లు తెలంగాణలో, 57 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలకు కొత్త కనెక్టివిటీ…
ఖమ్మం-దేవరపల్లి హైవే సిద్ధం…
హైదరాబాద్-విశాఖ దూరం 56 కి.మీ తగ్గింపు
Greenfield Express Highway: ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ట్విట్టర్ వేదికగా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ నాలుగు వరుసల హైవే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే వాహనదారులకు ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది.
ఈ హైవే మొత్తం 162 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైంది. ఇందులో 106 కిలోమీటర్లు తెలంగాణలో, 57 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఖమ్మం నుంచి ప్రారంభమై, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వద్ద ఇది ముగుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 4,609 కోట్లు ఖర్చు చేశారు.
ఈ కొత్త హైవే వల్ల హైదరాబాద్ నుంచి రాజమండ్రి మరియు విశాఖపట్నం వెళ్లేవారికి చాలా లాభం చేకూరుతుంది. విజయవాడ మీదుగా వెళ్లే అవసరం లేకుండా, నేరుగా ప్రయాణించవచ్చు. దీని వల్ల ప్రయాణ దూరం సుమారు 56 కిలోమీటర్లు తగ్గుతుంది, అలాగే సమయం కూడా ఆదా అవుతుంది.
ప్రయాణికుల భద్రత కోసం ఈ హైవేపై ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక సిసిటివి కెమెరా ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో వెలుతురు కోసం సౌరశక్తితో పనిచేసే లైట్లను అమర్చారు. హైవేపై కేవలం 9 చోట్ల మాత్రమే వాహనాలు ఎక్కడానికి, దిగడానికి అవకాశం కల్పించారు.
ఏప్రిల్ నాటికి ఈ హైవేను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఛార్జీలు (Toll Charges) వసూలు చేస్తారు. ఈ హైవే పూర్తయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది.
Be the first to react