ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ దిశగా మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ప్రజలకు అనేక సేవలను ‘మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం, తాజాగా పోలీస్ శాఖకు సంబంధించిన కీలక సేవలను కూడా వాట్సాప్‌లోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సంక్రాంతి నాటికి అన్ని ప్రభుత్వ సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ వివరాలు, ఎఫ్‌ఐఆర్ స్టేటస్, వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్ల సమాచారం, చలాన్ల చెల్లింపు వంటి సేవలు వాట్సాప్ ద్వారానే పొందే వీలుంది.
ఈ కొత్త సేవలను ఉపయోగించుకోవాలంటే ముందుగా 95523 00009 నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌లో ‘బీఖి’ అని మెసేజ్ పంపితే ‘మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ ఆప్షన్ తెరపైకి వస్తుంది. సేవలను తెలుగులో పొందాలంటే ‘టీఈ’ అని టైప్ చేయాలి. తరువాత ‘సేవను ఎంచుకోండి’ అనే ఆప్షన్‌లో పోలీస్ శాఖను సెలెక్ట్ చేస్తే ఎఫ్‌ఐఆర్, ఎఫ్‌ఐఆర్ స్టేటస్, ఈ-చలాన్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వాహనదారులు తమ వాహన నంబర్‌ను నమోదు చేస్తే, పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల వివరాలు పూర్తిగా కనిపిస్తాయి.
ఈ-చలాన్‌లను అదే వాట్సాప్ ద్వారానే ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇతర ఆన్‌లైన్ పేమెంట్ విధానాల ద్వారా చలాన్లను చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తైన వెంటనే రసీదు కూడా వాట్సాప్‌లోనే అందుతుంది. ఒకవేళ వాహనంపై ఎటువంటి చలాన్లు లేకపోతే ‘నో చలానాస్ ఫౌండ్’ అనే మెసేజ్ వస్తుంది. పోలీస్ శాఖ, రవాణా శాఖ విధించిన చలాన్లు రెండూ ఒకే చోట కనిపించడం వల్ల వాహనదారులకు ఇది ఎంతో సౌకర్యంగా మారింది.
ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచడం, ప్రజల సమయం ఆదా చేయడం, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ డిజిటల్ విధానాల ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆదాయం, భూ రికార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్లు వంటి అనేక సేవలు వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ సేవలు కూడా చేరడంతో ‘మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ మరింత బలపడింది. రాష్ట్ర ప్రజలు ఈ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ప్రభుత్వ సేవలను మరింత సులభంగా పొందాలని అధికారులు సూచిస్తున్నారు.