ఆంధ్రప్రదేశ్‌లో రహదారి మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్‌ను వేగవంతం చేసింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానించే విశాఖపట్నం–రాయపూర్ ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రూ.16,482 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ హైవేను 2026 డిసెంబర్ నాటికి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ హైవే ఏపీ పరిధిలో సుమారు 100 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం సమీపంలో కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిని అనుసంధానిస్తూ ప్రారంభమై, విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా సాగుతుంది. పాచిపెంట మండలం బంగారుగుడి ప్రాంతం తర్వాత ఈ రహదారి ఒడిశాలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికే ఏపీ పరిధిలో 92 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. కొన్ని అటవీ ప్రాంతాలు, భూసమస్యల కారణంగా కొన్ని చోట్ల పనులు నెమ్మదించినా, మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రత్యేకతల్లో ఒకటి విజయనగరం జిల్లా ఎల్.కోట వద్ద చేపట్టిన వినూత్న నిర్మాణం. అక్కడ ఒక చెరువు చుట్టూ వృత్తాకారంగా రహదారిని నిర్మించడం ఇంజినీరింగ్ పరంగా విశేషంగా నిలుస్తోంది. అలాగే ఈ కారిడార్‌లో కొండలు, అడవుల మధ్య వంపులు తిరుగుతూ రహదారి సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాలోకి ప్రవేశించిన తర్వాత, కొరాపుట్ జిల్లా సుంకి ఘాట్ సమీపంలో రెండు భారీ సొరంగాలను నిర్మిస్తున్నారు. ఒక్కో సొరంగం సుమారు 3.4 కిలోమీటర్ల పొడవు ఉండటం విశేషం.
ప్రస్తుతం రాయపూర్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఎన్‌హెచ్–26 మార్గంలో 597 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తైతే ఈ దూరం 464 కిలోమీటర్లకు తగ్గుతుంది. అంటే దాదాపు 133 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా డిజైన్ చేసిన ఈ రహదారి వల్ల ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారనుంది.
ఈ హైవే అందుబాటులోకి వస్తే విశాఖపట్నం నుంచి రాయపూర్ చేరుకునేందుకు ప్రస్తుతం పడుతున్న 12 గంటల సమయం కేవలం 6 గంటలకు తగ్గుతుంది. దీంతో సరుకు రవాణా వేగవంతమవడంతో పాటు, పారిశ్రామిక అభివృద్ధికి, వ్యాపారాలకు పెద్ద ఎత్తున ఊతం లభించనుంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల పరిశ్రమలు విశాఖపట్నం పోర్ట్‌కు నేరుగా అనుసంధానమవడం వల్ల ఈ ప్రాజెక్ట్ మూడు రాష్ట్రాల అభివృద్ధికి కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు.