ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణి మహిళల ఆరోగ్య సంరక్షణకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు ప్రతి నెలా ఉచితంగా పోషకాహారం అందిస్తోంది. అవగాహన లేకపోవడంతో చాలా మంది ఈ సదుపాయాన్ని పొందలేకపోతుండటంతో, అర్హులైన ప్రతి గర్భిణికి ఈ పథకం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ పథకం కింద గర్భం నిర్ధారణ అయిన మహిళలు ఒకసారి అంగన్‌వాడీలో తమ పేరును నమోదు చేసుకుంటే సరిపోతుంది. పీహెచ్‌సీ ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు గర్భిణుల వివరాలను అంగన్‌వాడీ కార్యకర్తలకు చేరవేసే బాధ్యత తీసుకుంటున్నారు. దీంతో గర్భిణులు ప్రత్యేకంగా ఎలాంటి కష్టాలు పడకుండానే పోషకాహారాన్ని పొందే అవకాశం కలుగుతోంది.
గర్భిణులు తప్పనిసరిగా మాతా–శిశు సంరక్షణ (MCP) కార్డు తీసుకోవాలి. వైద్యులు గర్భాన్ని నిర్ధారించిన వెంటనే ఈ కార్డు జారీ చేస్తారు. ఇందులో ఉన్న ఆర్‌సీహెచ్ (RCH) ఐడీ ఆధారంగా అంగన్‌వాడీ కేంద్రాలు ప్రతి నెలా పోషకాహారాన్ని పంపిణీ చేస్తాయి. ఈ కార్డు ద్వారా గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు, పర్యవేక్షణ కూడా అందుతుంది.
పథకం కింద గర్భిణులకు మూడు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, అర కిలో నూనె, చిక్కీలు, బెల్లం, ఖర్జూరం, రెండు కిలోల రాగి–జొన్న పిండి, అటుకులు, ఐదు లీటర్ల పాలు, నెలకు రెండుసార్లు 25 గుడ్లు అందజేస్తారు. ప్రసవం తర్వాత కూడా బిడ్డకు మూడేళ్ల వయసు వచ్చే వరకు పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహారం అందించనున్నారు.
అంతేకాకుండా ప్రసవం అనంతరం మహిళలకు ఎన్టీఆర్ బేబీ కిట్ను కూడా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతంలో నిలిచిపోయిన ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు, బాల్య పోషక లోపాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.