ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన ‘పురమిత్ర యాప్’ మరింత ప్రభావవంతంగా మారుతోంది. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ యాప్‌లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా, ప్రజల నుంచి ఎక్కువగా వచ్చే సమస్యలపై నగరపాలక, పురపాలక కమిషనర్లు నేరుగా బాధ్యత వహించేలా కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఒకే అంశంపై ఒకే ప్రాంతం నుంచి ఐదుకు పైగా ఫిర్యాదులు వస్తే, అవి కమిషనర్ల లాగిన్‌లో ఆరెంజ్ కలర్ హాట్‌స్పాట్‌లుగా కనిపించేలా టెక్నాలజీని అప్‌డేట్ చేశారు.
ఈ హాట్‌స్పాట్‌లు ఏ ప్రాంతంలో ఏ సమస్య తీవ్రంగా ఉందో స్పష్టంగా చూపిస్తాయి. ఉదాహరణకు దోమల బెడద, తాగునీటి సరఫరా అంతరాయం, స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడం, పారిశుద్ధ్య లోపాలు వంటి అంశాలపై ఒకే ప్రాంతంలో ఎక్కువ ఫిర్యాదులు నమోదైతే, ఆ ప్రాంతం వెంటనే అధికారుల దృష్టికి వస్తుంది. ఈ విధానంతో సమస్యలను పేపర్‌ల్లో కాకుండా క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించే అవకాశం లభిస్తోంది. రాష్ట్రస్థాయిలో ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, కమిషనర్లు ప్రతిరోజూ ఉదయం తమ లాగిన్‌లో కనిపించే హాట్‌స్పాట్‌లను పరిశీలించి క్షేత్ర పర్యటనలకు వెళ్లాల్సిందే. అక్కడ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి, ఆర్థిక భారం లేని సమస్యలను వెంటనే పరిష్కరించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఫోటోలను పురమిత్ర యాప్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. సమస్య పరిష్కారమైన తర్వాత ఆరెంజ్ రంగులో ఉన్న హాట్‌స్పాట్ గ్రీన్ కలర్‌గా మారుతుంది. ఇది ప్రజలకు కూడా సమస్య పరిష్కారం జరిగిందని స్పష్టమైన సంకేతంగా మారుతుంది.
రోడ్లు, కాలువలు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు వంటి పెద్ద పనులు అవసరమైతే, సంబంధిత ఇంజినీర్లు అంచనాలు సిద్ధం చేసి కౌన్సిల్ ఆమోదంతో నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలి. రోడ్లపై గుంతలు పూడ్చడం వంటి చిన్న పనులను ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సిటిజన్ చార్టర్‌ను కచ్చితంగా అమలు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై తాఖీదులు, చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్పులతో ప్రజలకు మరింత దగ్గరగా పాలన సాగించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అధికారులు భావిస్తున్నారు.