IAS Transfers: ఏపీలో భారీ ప్రక్షాళన... 22 ఐఏఎస్ అధికారుల స్థానచలనం..!
IAS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీటీడీసీ ఎండీగా ఉన్న ఆమ్రపాలిని బాధ్యతల నుండి రిలీవ్ చేసి జీఏడీకి నివేదించాల్సిందిగా ఆదేశించగా, ఆమె స్థానంలో రవి సుభాష్‌ను నియమించారు.
గోదావరి పుష్కరాల బాధ్యతలు ఎవరికి దక్కాయో తెలుసా.. రంగంలోకి ఇద్దరు పవర్ ఫుల్ ఆఫీసర్లు!
టీటీడీ జేఈఓల నియామకంలో బిగ్ ట్విస్ట్! ఆరోగ్య, విద్యా విభాగానికి కొత్త రూపు!
స్కూల్ ఎడ్యుకేషన్ స్పెషల్ హెడ్‌గా శ్యామలరావు.. ఏపీలో మారిన ఐఏఎస్ అధికారుల లిస్ట్ ఇదిగో!
IAS Transfers: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా యంత్రాంగంలో కూటమి ప్రభుత్వం మరోసారి భారీగా మార్పులు చేర్పులు చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీఓ నంబర్ 1539 ద్వారా మొత్తం 22 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భారీ బదిలీలలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని ఆ బాధ్యతల నుండి రిలీవ్ చేయడం. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి నూతన పోస్టింగ్ కేటాయించకుండా, తదుపరి ఆదేశాల వరకు సాధారణ పరిపాలనా శాఖ (GAD) కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పర్యాటక, విద్యా మరియు రవాణా శాఖలలో ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. ఆమ్రపాలి స్థానంలో ఏపీటీడీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా పట్టంశెట్టి రవి సుభాష్‌ను నియమించగా, ఆయనకు అదనంగా ఏపీపీఎస్సీ (APPSC) కార్యదర్శి మరియు సీఈఓ బాధ్యతలను కూడా అప్పగించారు. పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్.ఎస్. రావత్ బాధ్యతలు చేపట్టనున్నారు. విద్యాశాఖను మరింత బలోపేతం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామలరావును బదిలీ చేయగా, రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ కార్యదర్శిగా కోనా శశిధర్ నియామకమయ్యారు. అలాగే ఏపీఎస్‌ఆర్‌టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఎఫ్ఎస్ అధికారి ఎం. శివప్రసాద్‌ను డిప్యుటేషన్‌పై నియమించారు.
స్థానిక పాలన, పట్టణాభివృద్ధి మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు సంబంధించి అనేక కీలక పోస్టింగ్‌లను ఖరారు చేశారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) నూతన కమిషనర్‌గా ప్రఖర్ జైన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఎం. జయకృష్ణను నియమించగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (JEO) గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ. శరత్‌ను కొనసాగిస్తూనే, అదే విభాగానికి ప్రభల గోపీనాథ్‌ను మరొక జేఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ (APSFL) ఎండీగా గీతాంజలి శర్మకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆరోగ్యం, హౌసింగ్ మరియు ప్రజా సంక్షేమ విభాగాలలో కూడా విస్తృత ప్రక్షాళన జరిగింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా కేవీఎన్ చక్రధర బాబుకు అదనపు బాధ్యతలు కేటాయించగా, హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హెప్సిబా రాణి కొర్లపాటి బాధ్యతలు చేపట్టనున్నారు. పురావస్తు మరియు మ్యూజియంల శాఖ కమిషనర్‌గా ముత్యాలరాజు రేవు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా పి. అరుణ్ బాబు నియామకమయ్యారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా ఐఎఫ్ఎస్ అధికారి బి. సునీల్ కుమార్ రెడ్డికి, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఈఓగా ఏఏఎల్ పద్మావతికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
రాబోయే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటి నుంచే పరిపాలనా యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. పుష్కర పనుల పర్యవేక్షణ మరియు సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదేశాలిచ్చింది. గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా (Special Officer) సీనియర్ అధికారి సురేష్ కుమార్‌ను నియమించగా, జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా నారాయణ భరత్ గుప్తాలకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పాలనా వేగాన్ని పెంచడం, సంక్షేమ పధకాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ భారీ అధికారుల రీషఫుల్ నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Be the first to react