Local Body Elections: 'Gen Z' కి స్థానిక సంస్థల సువర్ణావకాశం! చంద్రబాబు వినూత్న నిర్ణయం! NRI లకు కూడా ఛాన్స్??

Local Body Elections: మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలు కావడం వల్ల పరోక్ష ఎన్నికల్లో జరిగే అంతర్గత లాబీయింగ్‌కు అడ్డుకట్ట పడి పాలనలో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రజల్లో ఆదరణ, సమస్యలపై స్పష్టమైన విజన్ ఉన్న యువతకు ప్రత్యక్ష రాజకీయాల్లో నిరూపించుకోవడానికి ఇది అనువైన వేదికగా మారనుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ నాయకత్వానికి పెద్దపీట
స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ నాయకత్వానికి పెద్దపీట
  • అమెరికా తరహా ప్రజాస్వామ్యం: నగర ప్రజలే నేరుగా ఎన్నుకోనున్న ప్రథమ పౌరుడు.

  • సెలెక్ట్ & ఎలెక్ట్: 30 ఏళ్ల భవిష్యత్ రాజకీయాలకు సరికొత్త యువతరంగం.

Andhrapradesh: రాష్ట్ర రాజకీయ యవనికపై సిద్ధాంత బలం, పోరాట పటిమ, సేవా దృక్పథం ఉండి రాజకీయ అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న యువతరానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త మార్గాన్ని సుగమం చేస్తున్నారు. రాబోయే మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావడం ద్వారా స్థానిక స్వపరిపాలనలో ప్రజాస్వామ్య మూలాలను మరింత పటిష్టం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మార్పు కేవలం ఎన్నికల పద్ధతిలో మార్పు మాత్రమే కాదు, అర్హులైన ప్రతి యువతీ యువకుడి రాజకీయ భవిష్యత్తుకు లభించే అద్భుతమైన సువర్ణావకాశం.

అమెరికా తరహా ప్రజాస్వామ్యం – ప్రజల చేతుల్లోనే పూర్తి అధికారం

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశం ప్రజల భాగస్వామ్యం. అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలోనే, స్థానిక మునిసిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరూ నేరుగా తమ నాయకుడిని ఓటు వేసి ఎన్నుకునే విధానం ఇది. పిడుగురాళ్ల మున్సిపాలిటీ మొదలుకొని విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం వంటి మహానగరాల వరకు ప్రజలే నేరుగా మున్సిపల్ చైర్మన్ లేదా మేయర్ అభ్యర్థికి ఓటు వేస్తారు. ఈ నిర్ణయం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలు తమకిష్టమైన, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టుకునే పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది.

దొడ్డిదారి రాజకీయాలకు చెక్ – పాత పద్ధతికి స్వస్తి

పాత పరోక్ష పద్ధతిలో ప్రజలు వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్లను మాత్రమే ఎన్నుకునేవారు. ఆ తర్వాత అంతర్గత సమీకరణాలు, ఎక్కువ మంది కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ లేదా మేయర్ పీఠాన్ని దక్కించుకునేవారు. దీనివల్ల ప్రజలలో అసలైన ఆదరణ లేకపోయినా, ఒక్క వార్డులో అక్రమాలు, ధనబలం, రౌడీయిజంతో గెలిచి, తర్వాత లోపాయికారీ ఒప్పందాలతో ఊరు మొత్తానికి నాయకుడిగా చలామణీ అయ్యే ప్రమాదం ఉండేది. ప్రత్యక్ష ఎన్నికల రాకతో జనంలో బలం లేని ఆయారాం-గయారాం రాజకీయాలకు, గూండాయిజం, కబ్జాలకు పాల్పడే వర్గాలకు శాశ్వతంగా చెక్ పడుతుంది.

సమర్థులకే పట్టం – ప్రజాబలమే గెలుపు మంత్రం

గతంలో 1999లో ‘ప్రజాదీవెన’ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అనేక మంది విద్యావంతులను, సమర్థులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారికి సరైన అవకాశాలు కల్పించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్లు ఆశించే సీనియర్ నేతలు సైతం, తమ భవిష్యత్తు దృష్ట్యా ప్రజల్లో పట్టు, ఆమోదం ఉన్న అభ్యర్థులకే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యక్ష ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరి ప్రజా బలానికి, సమర్థతకు ఒక నిజమైన అగ్నిపరీక్షగా నిలుస్తాయి.

పారదర్శక పాలన – తెరవెనుక ఒప్పందాలకు ముగింపు

బలవంతపు ఏకగ్రీవాలు, వార్డుల వారీగా చేసుకునే లోపాయికారీ ఒప్పందాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయి. ప్రత్యక్ష ఎన్నికల విధానం రావడం వల్ల ఇలాంటి తెరవెనుక రాజకీయాలకు, కోవర్టు ఒప్పందాలకు తావు లేకుండా పోతుంది. ప్రతి అభ్యర్థి ప్రజల మధ్యకు వెళ్లి, తమ విజన్ ఏమిటో వివరించి, ప్రజల విశ్వాసాన్ని పొందితేనే విజయం సాధించగలరు. ఈ విధానం రాజకీయాల్లో పారదర్శకతను పెంచి, స్వచ్ఛమైన నాయకత్వం రూపుదిద్దుకోవడానికి పునాది వేస్తుంది.

Gen Z రాజకీయ అరంగేట్రం – నిర్ణయాధికారాల్లో యువత

నేటి తరం యువతకు (#GenZ) ఇది ఒక మహత్తరమైన అవకాశం. సమాజంలో తాము కోరుకునే మార్పు కోసం కేవలం ఆందోళనలు, ధర్నాలు చేయడానికే పరిమితం కాకుండా, నిర్ణయాధికార స్థానాల్లోకి రావడానికి ఇది ఉత్తమ వేదిక. స్థానిక సమస్యల పట్ల పూర్తి స్పష్టత, ఊరి సమగ్ర అభివృద్ధికి పక్కా ప్రణాళికలు ఉంటే చాలు. కోట్ల రూపాయల ఖర్చుతో పనిలేకుండా, నిస్వార్థ ఆలోచనలతో ఆయా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల బరిలో నిలవవచ్చు.

సమస్యలే ఎజెండా – పట్టణాల సర్వతోముఖాభివృద్ధి

యువత లేవనెత్తే ప్రజా సమస్యల ప్రశ్నలే వారికి ప్రజాక్షేత్రంలో మద్దతును తెచ్చిపెడతాయి. సమస్యలకు వారు చూపే సరైన పరిష్కార మార్గాలే వారిని ప్రజల హృదయాలకు చేరువ చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ, తమ పట్టణాలను స్మార్ట్ సిటీలుగా, ఆధునిక నగరాలుగా తీర్చిదిద్దుకునే శక్తి స్థానిక యువ నాయకత్వానికే ఉంటుంది.

భవిష్యత్తుకు బాట – 'సెలెక్ట్ & ఎలెక్ట్' విధానం

నారా లోకేష్ గారి నేతృత్వంలో పార్టీకి రాబోయే 30 ఏళ్ల భవిష్యత్తుకు సరిపడా నాయకత్వాన్ని సిద్ధం చేయడంలో ఈ స్థానిక ఎన్నికలు చుక్కానిగా నిలవనున్నాయి. "మన రాష్ట్రం... మన పట్టణం/నగరం... మన మేయర్/చైర్మన్" అనే నినాదంతో, 'సెలెక్ట్ అండ్ ఎలెక్ట్' విధానం ద్వారా అర్హులైన యువతకు, సరికొత్త రక్తానికి పెద్దపీట వేసే వాతావరణం ఏర్పడుతుంది. చైతన్యవంతమైన యువత ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.

ప్రవాసాంధ్రులకు (NRIs) రాజకీయాలు, పాలనా సంస్కరణలు
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రవాసాంధ్రులకు (NRIs) తమ స్వస్థలాల అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు, వారి అంతర్జాతీయ అనుభవాన్ని స్థానిక పాలనలోకి తీసుకురావడం ఒక విప్లవాత్మక ముందడుగు. విదేశాలలో ఆధునిక వ్యవస్థలు, పారదర్శక పాలనా పద్ధతులను ప్రత్యక్షంగా చూసిన ప్రవాస యువతకు రాష్ట్ర రాజకీయాల్లో లేదా స్థానిక నిర్ణయాధికార ప్రక్రియల్లో వేదిక లభిస్తే సమగ్ర మార్పు సాధ్యమవుతుంది. Andhra Pradesh Non-Resident Telugu Society (APNRTS) వంటి సంస్థల ద్వారా పెట్టుబడులతో పాటు, పాలనాపరమైన ఆలోచనలు పంచుకోవడానికి ఎన్నారైలకు మార్గం సుగమం అవుతోంది. విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ మాతృభూమిపై నిబద్ధత కలిగిన ఎన్నారై నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా పట్టణాలు, నగరాల అభివృద్ధిలో సరికొత్త దృక్పథం, గ్లోబల్ విజన్ అందుబాటులోకి వస్తాయి. గత టీడీపీ ప్రభుత్వ పాలనలోనూ ప్రవాసాంధ్రుల సామర్థ్యాన్ని గుర్తించి, రాష్ట్ర పునర్నిర్మాణంలో వారిని ప్రత్యక్ష రాజకీయాలలో భాగం చేస్తూ వారిని ఎమ్మెల్యే లు, ఎంపీలు, మినిస్టర్లు, పలు కార్పొరేషన్ ల ఛైర్మన్ లు మరియు వివిధ హోదాలలో అవకాశం లభించింది. అదేవిధంగా ప్రస్తుతం ఈ స్థానిక ఎన్నికలలో కూడా యువత తో పాటు ఎన్నారైలకు కూడా మంచి స్థానాలు దక్కుతాయని ఆశించవచ్చు. 

Tags

Be the first to react

Latest