Prajavedhika: మాజీ మంత్రి అనుచరుల కబ్జాలు, వైన్ షాప్ పేరిట రూ. 3 కోట్ల మోసంపై నేతలకు ఫిర్యాదు! వీఆర్వో అండతో దొంగ పట్టాలు
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదికలో ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మన్నె సుబ్బారెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల భూకబ్జాలు, నకిలీ పట్టాలు, లిక్కర్ షాపు లైసెన్సు మోసం, రెవెన్యూ రికార్డుల తారుమారు వంటి పలు సమస్యలపై వచ్చిన వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
- అర్ధరాత్రి వేళ తోటలోకి ప్రవేశించిన ఆ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరిది?
- కువైట్ నుంచి రాగానే షాక్: కన్నభూమి మాయం.. అసలైన రికార్డులను ఎవరు తారుమారు చేశారు?
- "ఆ రూ. 1.60 కోట్లు ఎక్కడికి పోయాయి?": లైసెన్స్ పేరుతో జరిగిన భారీ మోసంలో తెరవెనుక సూత్రధారి ఎవరు?
Prajavedhika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా వేదిక' గ్రీవెన్స్ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఏపీ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ మన్నె సుబ్బారెడ్డి నేరుగా ప్రజల వద్ద నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలు, అధికారుల నిర్లక్ష్యం, మోసాలు, రెవెన్యూ రికార్డుల తారుమారుపై బాధితులు నేతల ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు.
అన్నమయ్య జిల్లా సదుంకు చెందిన చోలేశ్వరనాయుడు తమ కుటుంబానికి చెందిన డి-పట్టా భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కబ్జా చేసి, లక్షల రూపాయల విలువైన దానిమ్మ తోటను నాశనం చేశారని ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నెలో స్థానిక వీఆర్వో సహకారంతో గ్రామకంఠం, ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారని కుమ్మరి చంద్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరుకు చెందిన నల్లూరి వెంకటేశ్వర్లు వైన్ షాపు లైసెన్సుల పేరుతో తన వద్ద రూ. 3 కోట్లు వసూలు చేసి మోసం చేశారని, మిగిలిన రూ. 1.60 కోట్లు ఇప్పించాలని కోరారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం చొప్పారామన్నగూడెంలో 41 ఏళ్లుగా సాగులో ఉన్న 64 సెంట్ల భూమిని దొంగ పట్టాలు సృష్టించి లాక్కున్నారని బొబ్బిలి రాంప్రసాద్ వినతిపత్రం అందజేశారు. అలాగే వైఎస్సార్ కడప జిల్లా టి. సుండుపల్లి మండలానికి చెందిన కామిని అంజనమ్మ పిల్లల పోషణ కోసం కువైట్ వెళ్లగా, తమ 2.03 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేయడమే కాకుండా ప్రశ్నించినందుకు భౌతిక దాడులకు పాల్పడ్డారని, హైకోర్టు ఉత్తర్వులున్నా పోలీసులు న్యాయం చేయలేదని ఆవేదన చెందారు.
అమరావతి మండలం మండెపూడిలో రీ-సర్వే లోపాల వల్ల 5 సెంట్ల భూమి తగ్గిపోయిందని బండ్లమూడి సురేష్, అన్నమయ్య జిల్లా కలకడలో 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని నాగరాజు అనే వ్యక్తి ఆక్రమించాడని సుబ్బమ్మ బృందం అర్జీలు సమర్పించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో అనుమతి లేకుండా సొంత పట్టా భూమిలో రోడ్డు వేశారని కోటపాటి రామాంజనేయులు, కలకడలో 88 సెంట్ల భూమిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఖాజవలీ, బనగానపల్లెలో ఇంటి స్థలం వివాదంపై తలారి సుజాత వినతులు అందించారు.
భూసమస్యలతో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణాలు, వైద్య సహాయం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ పలువురు అర్జీలు సమర్పించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మన్నె సుబ్బారెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఫోన్లలో మాట్లాడి త్వరితగతిన సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
Tags
Be the first to react
