Telangana News: తుపాకీ వీడి.. ప్రగతి వైపు... అడవిని వీడి జనజీవన స్రవంతిలోకి 124 మంది మావోయిస్టుల..!!
Telangana Maoists Surrender: తెలంగాణలో శాంతి సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో 124 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి. 70 ఆయుధాల అప్పగింత. నవ తెలంగాణ దిశగా అడుగులు..
Telangana Maoists Surrender: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడవి బాట పట్టిన సోదరులను జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి భారీ స్పందన లభించింది. ఏకంగా 124 మంది మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడి, ప్రజాస్వామ్య మార్గంలో నడవాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇది ఒక శుభపరిణామం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికత, పోలీసు యంత్రాంగం పట్ల నమ్మకంతో దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ (PLGA) కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరంతా సుమారు 70 అత్యాధునిక ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి, శాంతి వైపు అడుగులు వేయడం హర్షించదగ్గ విషయం. ఇది రేవంత్ సర్కార్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల పెరిగిన విశ్వాసానికి నిదర్శనం.
ఈ చారిత్రాత్మక లొంగుబాటు ప్రక్రియను పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి స్వయంగా అక్కడకు విచ్చేసి, లొంగిపోయిన వారికి స్వాగతం పలికి, వారితో మాట్లాడనున్నారు. శాంతియుత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించనున్నారు.
అడవిని వీడి వచ్చిన ఈ 124 మందికి ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో పునరావాస ప్యాకేజీలు అందనున్నాయి. వీరు సమాజంలో గౌరవప్రదంగా బతికేందుకు అవసరమైన ఆర్థిక సాయం, ఇళ్ల స్థలాలు పిల్లల చదువుల విషయంలో సీఎం గారు హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇకపై అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని, ప్రజలందరూ ప్రశాంతంగా జీవించవచ్చని భావిస్తున్నారు.
Be the first to react