USA: అమెరికా రాజకీయ వేదికపై తెలుగు యువకుడి సత్తా.. ‘బాయ్స్ నేషన్’ ఉపాధ్యక్షుడిగా క్రిష్ కొర్రపాటి!

USA: అమెరికా రాజకీయ నాయకత్వాన్ని తీర్చిదిద్దే అత్యంత ప్రతిష్టాత్మకమైన యువజన కార్యక్రమాల్లో ఒకటైన అమెరికన్ లెజియన్ బాయ్స్ నేషన్ వేదికపై తెలుగు యువకుడు క్రిష్ కొర్రపాటి అరుదైన ఘనత సాధించాడు. అత్యంత పోటీతో కూడిన ఎన్నికల్లో విజయం సాధించి బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై అమెరికాలోని ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచాడు.

NRI
NRI

బాయ్స్ నేషన్ ఎన్నికల్లో తెలుగు యువకుడి ఘన విజయం.. ఉపాధ్యక్ష పదవి కైవసం..

అమెరికా యువ నాయకత్వ వేదికపై తెలుగు ప్రతిభకు ఘన గుర్తింపు..

వాషింగ్టన్ డి.సి./అమెరికా: అమెరికా రాజకీయ నాయకత్వాన్ని తీర్చిదిద్దే అత్యంత ప్రతిష్టాత్మకమైన యువజన కార్యక్రమాల్లో ఒకటైన అమెరికన్ లెజియన్ బాయ్స్ నేషన్ వేదికపై తెలుగు యువకుడు క్రిష్ కొర్రపాటి అరుదైన ఘనత సాధించాడు. అత్యంత పోటీతో కూడిన ఎన్నికల్లో విజయం సాధించి బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై అమెరికాలోని ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచాడు.

అమెరికాలోని 49 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేవలం 100 మంది హైస్కూల్ సీనియర్ విద్యార్థులకు మాత్రమే బాయ్స్ నేషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అంతకుముందు ఆయా రాష్ట్రాల్లో నిర్వహించే బాయ్స్ స్టేట్ కార్యక్రమాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులే జాతీయ స్థాయికి ఎంపికవుతారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు అమెరికా సెనెట్ తరహాలో ఒక వారం పాటు మాక్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తూ చట్టాల రూపకల్పన, ప్రజాస్వామ్య విధానాలు, రాజకీయ చర్చలు, నాయకత్వ నైపుణ్యాలపై అనుభవాన్ని పొందుతారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు నేషనలిస్ట్స్, ఫెడరలిస్ట్స్ అనే రెండు రాజకీయ బృందాలుగా విడిపోయి తమ నాయకత్వ ప్రతిభ, వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో నార్త్ కరోలినా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన క్రిష్ కొర్రపాటి తన తోటి ప్రతినిధుల విశ్వాసాన్ని గెలుచుకుని బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అర్కాన్సాస్ రాష్ట్రానికి చెందిన సాయర్ రే అధ్యక్షుడిగా ఎన్నికై ఈ ఏడాది బాయ్స్ నేషన్ నాయకత్వ బృందానికి సారథ్యం వహిస్తున్నారు.

క్రిష్ కొర్రపాటి కుటుంబ మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పల్లపాడు గ్రామం. అమెరికాలో స్థిరపడిన ఈ తెలుగు కుటుంబానికి చెందిన క్రిష్ సాధించిన విజయం తెలుగు వారి ప్రతిభను మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది.

క్రిష్ తల్లిదండ్రులు డాక్టర్ వినీత్ కొర్రపాటి, స్మిత. ఆయన తాతమ్మలు డాక్టర్ మధు కొర్రపాటి, శిరీష. అలాగే స్మిత తల్లిదండ్రులు గులివెందుల రమణమూర్తి, హేమలత తమ మనవడు సాధించిన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.

బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో క్రిష్ కొర్రపాటికి అమెరికా రాజధాని క్యాపిటల్ హిల్లో ఫెడరల్ ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసే అవకాశం లభించనుంది. అలాగే దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే అరుదైన అవకాశాన్ని కూడా ఆయన అందుకోనున్నాడు.

కఠినమైన ఎంపిక ప్రక్రియను అధిగమించి అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నాయకత్వ కార్యక్రమంలో ఉపాధ్యక్ష పదవిని గెలుచుకోవడం క్రిష్ కొర్రపాటి ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఈ విజయం అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రవాస తెలుగు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

అమెరికా రాజకీయ నాయకత్వ శిక్షణ వేదికపై తెలుగు యువకుడు సాధించిన ఈ అరుదైన విజయంతో మరోసారి తెలుగు వారి ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా చాటబడింది.

Tags

Be the first to react

Latest