Silicon Andhra: ఓక్లాండ్ వేదికగా అరుదైన ప్రపంచ రికార్డు... 1,712 మందితో... గిన్నిస్ రికార్డుల్లో నిలిచిన సిలికానాంధ్ర!

Silicon Andhra: అమెరికాలోని ఓక్లాండ్‌లో జరిగిన సిలికానాంధ్ర 25వ వార్షికోత్సవంలో 1,712 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏకకాలంలో 18 తెలుగు పద్యాలను పారాయణం చేసి గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించారు. అమెరికా, కెనడాల్లోని 250కి పైగా కేంద్రాల్లో సెప్టెంబరు నుండి ప్రారంభం కానున్న 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు సంస్థ ప్రకటించింది.

ఓక్లాండ్ వేదికగా అరుదైన ప్రపంచ రికార్డు
ఓక్లాండ్ వేదికగా అరుదైన ప్రపంచ రికార్డు
  • సుమతి, వేమన శతకాలతో గిన్నిస్ బుక్ రికార్డు.. విదేశాల్లో తెలుగు వెలుగులు..!

  • అమెరికా, కెనడాల్లో సెప్టెంబర్ నుండి తెలుగు క్లాసులు.. 2026-27 అడ్మిషన్ల బిగ్ అప్‌డేట్..!

  • తాతలు, అమ్మమ్మల ప్రోత్సాహంతోనే మాతృభాష రక్షణ.. మనబడి డీన్ బామర్తి రాజు పిలుపు..!

Silicon Andhra: ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో సుమతి మరియు వేమన శతకాల నుంచి ఎంపిక చేసిన 18 పద్యాలను 1,712 మంది ప్రతినిధులు ఏకకాలంలో కంఠస్థంగా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో అత్యధికులు సిలికానాంధ్ర 'మనబడి' విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సమన్వయకర్తలు కావడం విశేషం. విదేశీ గడ్డపై తెలుగు భాషా ప్రావీణ్యాన్ని, సాహిత్యం పట్ల తమకున్న గాఢమైన అనుబంధాన్ని ప్రదర్శిస్తూ అంతర్జాతీయ వేదికపై తెలుగు భాషా, సాహిత్య వైభవాన్ని ప్రతిధ్వనించేలా చేశారు.

సిలికానాంధ్ర మనబడి ప్రెసిడెంట్ మరియు డీన్ బామర్తి రాజు మాట్లాడుతూ, గిన్నిస్ ప్రపంచ రికార్డు వేదికపై 1,712 మంది కలిసి తెలుగు పద్యాలను పారాయణం చేయడం మనబడి ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న నిరంతర భాషా సేవకు గొప్ప నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు. వేలాది మంది పిల్లల భాషా ప్రయాణం తరగతి గదిలోనే ప్రారంభమైందని, విదేశాల్లో ఉన్న తెలుగు కుటుంబాలు తమ పిల్లలను మనబడిలో చేర్పించి మాతృభాషను నేర్పించాలని కోరారు. ఈ విషయంలో భారతదేశంలో ఉన్న తాతలు, అమ్మమ్మలు మరియు నానమ్మలు కూడా తమ మనుమళ్లను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అంతర్జాతీయ గుర్తింపు విషయంలో సిలికానాంధ్ర మనబడి మరొక అరుదైన రికార్డును కలిగి ఉంది. ప్రపంచంలోనే వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (WASC) గుర్తింపు పొందిన ఏకైక తెలుగు విద్యా సంస్థగా సిలికానాంధ్ర మనబడి చరిత్రకెక్కింది. సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడటం సమర్థవంతంగా నేర్పించారు. విద్యార్థుల నైపుణ్యాన్ని దశలవారీగా పెంపొందించేలా బాలబడి-1, బాలబడి-2 నుంచి ప్రభాసం వరకు విభిన్న స్థాయిల్లో శాస్త్రీయంగా  ప్రణాళికను రూపొందించారు.

భాషా వికాసంలో లోతైన అధ్యయనం కోసం 'ప్రబోధం' పేరుతో ఉన్నత స్థాయి ఐచ్ఛిక కోర్సును మరియు 'బాలరంజని' యాప్ ద్వారా ఇంటరాక్టివ్ అభ్యాసాన్ని అందిస్తున్నారు. వీటితో పాటు 'బాలానందం', 'తెలుగు మాట్లాట', 'తెలుగుకి పరుగు', 'మనకరం' వంటి వైవిధ్యభరితమైన పాఠ్యేతర కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు.

అమెరికా మరియు కెనడాల్లోని 250కి పైగా కేంద్రాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నూతన ప్రవేశాలు ప్రారంభమైనట్లు సంస్థ ప్రకటించింది. సెప్టెంబరు మొదటి వారాంతం నుండి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, తెలుగు భాషా సంస్కృతులను భావితరాలకు సజీవంగా అందించే ఈ బృహత్తర కార్యక్రమంలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సిలికానాంధ్ర పిలుపునిచ్చింది.

Tags

Be the first to react

Latest