నెలకు 10 వేల పెట్టుబడి లక్ష ఆదాయం! ఓపికతో ఈ పంట సాగు చేసుకుంటే చాలు!
Coriander Farming: వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించాలంటే సరైన పంట ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను సాగు చేస్తూ రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. అలాంటి పంటల్లో కొత్తిమీర కూడా ఒకటి. కేవలం రూ.25 వేల పెట్టుబడితో లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని నంద్యాల జిల్లాకు చెందిన ఓ రైతు చెబుతున్నారు.
- రూ.25 వేల పెట్టుబడితో ఎకరాకు లక్ష రూపాయల వరకు ఆదాయం!
- నెల రోజుల్లోనే చేతికొచ్చే కొత్తిమీర పంటతో భారీ లాభాలు!
Coriander Farming: వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించాలంటే సరైన పంట ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను సాగు చేస్తూ రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. అలాంటి పంటల్లో కొత్తిమీర కూడా ఒకటి. కేవలం రూ.25 వేల పెట్టుబడితో లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని నంద్యాల జిల్లాకు చెందిన ఓ రైతు చెబుతున్నారు.
నెల రోజుల్లో చేతికొచ్చే కొత్తిమీర పంట
నంద్యాల జిల్లా డోన్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సూర్య అనే రైతు తన పొలంలో కొత్తిమీర సాగు చేస్తున్నారు. నీటి కొరత కారణంగా ఇతర పంటల సాగులో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తక్కువ సమయంలో చేతికొచ్చే కొత్తిమీరను ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ పంట సుమారు నెల రోజుల్లోనే కోతకు వస్తుందని, పెట్టుబడి కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు.
10 సెంట్లలోనే రూ.40 వేల లాభం
రైతు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 30 సెంట్ల భూమిలో కొత్తిమీర సాగు చేపట్టారు. ఇందులో ఇప్పటికే 10 సెంట్ల పంటను కోసి విక్రయించారు. దాని ద్వారా సుమారు రూ.40 వేల ఆదాయం వచ్చింది. ఆ పంట సాగు, ఇతర ఖర్చులు కలిపి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అయ్యాయని, ఖర్చులు పోను దాదాపు రూ.40 వేల లాభం మిగిలిందని తెలిపారు.
ఎకరాకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం
కొత్తిమీరను మార్కెట్లో కట్టల రూపంలో విక్రయిస్తారు. మార్కెట్ ధరలను బట్టి ఒక్కో కట్టకు రూ.1.50 నుంచి రూ.2 వరకు ధర లభిస్తుందని రైతు వివరించారు. వ్యాపారులకు లేదా దుకాణాలకు నేరుగా విక్రయిస్తే ధర కొంత తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగితే ఎకరాకు సుమారు రూ.25 వేల పెట్టుబడితో లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్ ధరలు తగ్గితే లాభాలు కూడా తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
ఒకేసారి కాకుండా విడతల వారీగా సాగు
కొత్తిమీర సాగులో రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం పంట కోత, విక్రయాల నిర్వహణ. మొత్తం భూమిలో ఒకేసారి పంట వేయకుండా 10 సెంట్ల చొప్పున విడతల వారీగా సాగు చేస్తే ప్రయోజనం ఉంటుందని సూర్య సూచిస్తున్నారు. ఒక మడి పంట కోతకు వచ్చినప్పుడు మరో మడి పెరుగుతూ ఉంటుంది. దీంతో పంటను ఒకేసారి కోసి అమ్మాల్సిన ఇబ్బంది ఉండదని, మార్కెట్కు అనుగుణంగా విక్రయించుకోవచ్చని చెబుతున్నారు.
వర్షాలతో పంటకు నష్టం జరిగే ప్రమాదం
కొత్తిమీర సాగులో ప్రధానంగా వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని రైతు తెలిపారు. అధిక వర్షాలు పడితే పంట దెబ్బతిని పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మందులు పిచికారీ చేసినా వర్షాల వల్ల కలిగే నష్టాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదని వివరించారు. అందుకే వాతావరణ పరిస్థితులను గమనిస్తూ విడతల వారీగా సాగు చేయడం మంచిదని సూచించారు.
కూలీల అవసరం.. మార్కెట్ ధరలే కీలకం
ఈ పంట సాగులో కుటుంబ సభ్యుల సహకారం ఉంటే కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చని రైతు తెలిపారు. పంటను స్వయంగా సాగు చేయడంతో పాటు కోత కోసి మార్కెట్కు తీసుకెళ్లి విక్రయించగలిగితే మరింత లాభం పొందవచ్చన్నారు. అయితే కొత్తిమీర సాగు చేసే రైతులు మార్కెట్ ధరలు, వాతావరణ పరిస్థితులు, పంట కోతకు అవసరమైన శ్రమను ముందుగానే అంచనా వేసుకోవాలని సూచిస్తున్నారు.