Australia: మెల్బోర్న్ లో ఏపీఎన్ఆర్టీ కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం.. నూతన కో-ఆర్డినేటర్లకు ఘన సత్కారం!

Australia: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నియమించిన ఏపీఎన్ఆర్టీ (APNRT) కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. నూతన బాధ్యతలు స్వీకరించిన కో-ఆర్డినేటర్లు ఒకే వేదికపై కలుసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Australia
Australia

రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసాంధ్రుల పూర్తి మద్దతు: మెల్బోర్న్ సమావేశం..

ఏపీ ప్రగతికి కలిసి పనిచేస్తామని ఏపీఎన్ఆర్టీ కో-ఆర్డినేటర్ల ప్రతిజ్ఞ..

మెల్బోర్న్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నియమించిన ఏపీఎన్ఆర్టీ (APNRT) కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. నూతన బాధ్యతలు స్వీకరించిన కో-ఆర్డినేటర్లు ఒకే వేదికపై కలుసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

అనంతరం నూతనంగా నియమితులైన కో-ఆర్డినేటర్లందరినీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్రపై విస్తృతంగా చర్చించారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో మరింతగా అనుసంధానించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవాసాంధ్రులకు చేరవేయాలని నిర్ణయించారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు క్రియాశీలక భాగస్వాములుగా వ్యవహరించాలని, తమ అనుభవం, నైపుణ్యం, సేవలను రాష్ట్ర పురోగతికి వినియోగించేందుకు కట్టుబడి పనిచేస్తామని నూతన కో-ఆర్డినేటర్లు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఏపీఎన్ఆర్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ లగడపాటి సుబ్బారావు, ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ సభ్యులు నర్మదా జొన్నలగడ్డ, గోపి నంబళ్ల పాల్గొన్నారు. అలాగే కో-ఆర్డినేటర్లు సుమా తాటినేని, కిషోర్ బలుసు, బాల పసుపులేటి, మహాలక్ష్మి, భారత్, చరణ్, రామ్, శ్రీనాథ్, ఆదిత్యతో పాటు పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు, ఇతర కో-ఆర్డినేటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సమావేశం ముగింపులో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవాస భారతీయుల సహకారాన్ని మరింత విస్తరించే దిశగా సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఆంధ్రప్రదేశ్ పురోగతికి తోడ్పడే కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

Tags

Be the first to react

Latest