ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. అమరావతిలో భారీ స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణ ప్రణాళికలతో పాటు, జిల్లాల్లో కూడా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తిరుపతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుపతి రూరల్ మండలం దామినేడు పరిధిలో 28.37 ఎకరాల భూమిని స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని ఉచితంగా స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క ఎకరా భూమి విలువ సుమారు రూ.2.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఈ భూమిని కేవలం స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి కోసమే వినియోగించాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. రెవెన్యూ శాఖ అనుమతి లేకుండా భూమిని ఇతర అవసరాలకు కేటాయించరాదని, బదిలీలు చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీని ద్వారా తిరుపతిలో ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
శాప్ ఛైర్మన్ రవి నాయుడు తిరుపతిలో క్రీడల ప్రోత్సాహం కోసం భూమి కేటాయించాలని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరగా, సీఎం వెంటనే సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిని రాష్ట్ర స్థాయి క్రీడా హబ్‌గా అభివృద్ధి చేస్తామని రవి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా మంత్రివర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్లుగా ఐదుగురిని నియమించింది. అలాగే వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వీసీగా కె.ధనుంజయరావును నియమించింది. శాశ్వత వీసీ నియామకం వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నియామకాలతో పాలన, విద్యా రంగాల్లోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.