ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీపికబురు వినిపించింది. రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీలో కీలక మార్పులు చేసేందుకు నిర్ణయించింది. వచ్చే జనవరి నుంచి రేషన్ దుకాణాల ద్వారా గోధుమపిండి, రాగులు కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఊరట కలగనుంది.
ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. గతంలో కందులు, గోధుమపిండి వంటి నిత్యావసరాలు కూడా ఇచ్చేవారు. అయితే కాలక్రమేణా వాటి పంపిణీ నిలిచిపోయింది. దీంతో ప్రజలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మళ్లీ రేషన్ సరుకుల పరిధిని విస్తరించాలని నిర్ణయించింది.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో గోధుమపిండి కేజీ ధర రూ.64 నుంచి రూ.65 వరకు ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు కిలో గోధుమపిండిని కేవలం రూ.16కే అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనవరి నుంచి ప్రతి రేషన్ కార్డుకు కిలో గోధుమపిండి పంపిణీ చేయనున్నారు. నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో ఈ గోధుమపిండి అందించనున్నారు.
అలాగే ఆరోగ్యపరంగా మేలైన ఆహారంగా భావించే రాగులను కూడా రేషన్‌లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం బదులుగా మూడు కేజీల రాగులు అందించనున్నారు. ఇప్పటికే డిసెంబర్ నెల కోటాలో రాగుల పంపిణీ ప్రారంభమైంది. ఈ నిర్ణయం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు, రాగులు పండించే రైతులకు కూడా గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి డిసెంబర్ 15తో గడువు ముగియనుంది. ఆలోపు లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకుంటే ఉచితంగా పొందవచ్చు. గడువు దాటితే రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జనవరి నుంచి కొత్త రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.