ఇటీవలి రోజుల్లో విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo Airlines) భారీ ఊరట ప్రకటించింది. ఈ అంతరాయాల వల్ల నష్టపోయిన ప్రయాణికులకు మొత్తం రూ.500 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించనున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్న ఇండిగో, నష్టపరిహారం చెల్లింపును పారదర్శకంగా, వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది.
విమానాలు బయలుదేరే 24 గంటల ముందు అకస్మాత్తుగా రద్దయిన సర్వీసుల ప్రయాణికులు, కొన్ని విమానాశ్రయాల్లో తీవ్రంగా చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఈ పరిహారం అందించనున్నట్లు ఇండిగో స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది ప్రయాణికులకు రిఫండ్‌లు పూర్తయ్యాయని, మిగిలిన వారికి కూడా త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని సంస్థ తెలిపింది. “ప్రస్తుతం మా అంచనా ప్రకారం నష్టపరిహారం మొత్తం రూ.500 కోట్లను దాటే అవకాశం ఉంది. బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం” అని ఇండిగో పేర్కొంది.
ఈ నెల 3, 4, 5 తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన విమాన సర్వీసులు, విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఇండిగో తెలిపింది. ఈ ప్రక్రియను పూర్తిచేసిన అనంతరం జనవరి నుంచి బాధిత ప్రయాణికులను నేరుగా సంప్రదించి పరిహారం చెల్లింపులు ప్రారంభిస్తామని వెల్లడించింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సులభంగా పరిహారం పొందేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికుల విశ్వాసాన్ని తిరిగి పొందడమే లక్ష్యమని పేర్కొంది.
మరోవైపు, గత నాలుగు రోజులుగా ఇండిగో కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని కంపెనీ వెల్లడించింది. శనివారం దేశవ్యాప్తంగా 2,000కు పైగా విమానాలను నడపనున్నట్లు తెలిపింది. కార్యకలాపాల్లో అంతరాయానికి గల మూల కారణాలను విశ్లేషించేందుకు ప్రముఖ విమానయాన నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలోని ‘చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ఎల్‌సీ’ అనే ప్రత్యేక నిపుణుల బృందాన్ని నియమించినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కూడా తీవ్రంగా స్పందించింది. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను పిలిపించి విచారణ చేపట్టినట్లు సమాచారం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ స్పష్టం చేసింది.