ఇప్పటి రోజుల్లో చాలా మంది రైస్ కుక్కర్ లేదా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండటానికి అలవాటు పడ్డారు. ఈ విధానంలో వండిన అన్నం మెత్తగా, రుచిగా ఉంటుందని చాలామంది ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ప్రెషర్ కుక్కర్‌లో వండినప్పుడు అన్నంలో ఉన్న పోషకాలు బయటకు పోకుండా నిల్వ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ అన్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే అభిప్రాయం ఉంది.
ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం ఉడికే సమయంలో ఆవిరి బయటకు పోకుండా లోపలే ఉంటుంది. ఈ ఆవిరి అధిక ఉష్ణోగ్రతగా మారి ఆహారం త్వరగా ఉడికేందుకు సహాయపడుతుంది. తక్కువ సమయంలో వంట పూర్తవడం వల్ల గ్యాస్ లేదా విద్యుత్ కూడా ఆదా అవుతుంది. అన్నం మాత్రమే కాకుండా పప్పులు, కూరగాయలు కూడా ఈ విధానంలో త్వరగా ఉడుకుతాయి.
అయితే, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆహారం ఉడికించడం ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రెషర్ కుక్కర్‌లో పిండిపదార్థాలను ఉడికిస్తే ‘యాక్రిలామైడ్’ అనే రసాయనం ఏర్పడుతుందని కొంతమంది చెబుతున్నారు. దీర్ఘకాలం ఈ రకమైన ఆహారం తీసుకుంటే నాడీ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో ఆహార నిపుణులు సమతుల్యమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వంట చేయడంలో కేవలం ఒకే పద్ధతిపై ఆధారపడకుండా, వివిధ పద్ధతుల్లో వంట చేయడానికి అలవాటు పడాలని సూచిస్తున్నారు. తినే ఆహారం రుచిగా ఉండటమే కాకుండా, ఎలా వండారన్నదీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
మరోవైపు, ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే వాదన కూడా ఉంది. ఈ విధానంలో బియ్యం, నీళ్లలోని హానికరమైన బ్యాక్టీరియా నశిస్తాయని, అన్నం తేలికగా జీర్ణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, స్టార్చ్ కొంత మేర తగ్గడంతో ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉండి, ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని అంటున్నారు.