ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశాల సమయంలో ఎదురయ్యే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపింది. ఈ మేరకు తాజాగా కీలక జీవోను జారీ చేసింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు ఉంది. అంటే వారు మొత్తం ఆరు సబ్జెక్టుల్లో కాకుండా ఐదు లేదా నాలుగు సబ్జెక్టులు మాత్రమే చదివి ఉత్తీర్ణత సాధించవచ్చు. అయితే ఐఐటీ, ఎన్‌ఐటీ కౌన్సెలింగ్ నిబంధనల్లో మాత్రం తప్పనిసరిగా ఐదు సబ్జెక్టుల్లో పాస్ అయి ఉండాల్సిందేననే షరతు ఉండటంతో, నాలుగు సబ్జెక్టులు మాత్రమే చదివిన దివ్యాంగ విద్యార్థులు ప్రవేశాలకు అనర్హులుగా మారుతున్నారు.
ఈ విభేదాల కారణంగా గత కొన్నేళ్లుగా అనేక మంది దివ్యాంగ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. చదువులో ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం సాంకేతిక నిబంధనల కారణంగా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై ప్రభుత్వం ప్రతి ఏడాది తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తూ వచ్చినా, శాశ్వత పరిష్కారం లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది కూడా పలువురు దివ్యాంగ విద్యార్థులు కౌన్సెలింగ్ సమయంలో సమస్యలు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో కీలక మార్పును తీసుకొచ్చింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం, దివ్యాంగ విద్యార్థులు ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు తీసుకుంటే, మిగిలిన ఐదు సబ్జెక్టుల్లో వారు సాధించిన సగటు మార్కులను ఆ మినహాయింపు పొందిన సబ్జెక్టుకు కేటాయిస్తారు. తద్వారా ఆ విద్యార్థి ఐదు సబ్జెక్టుల్లో పాస్ అయినట్లుగా అధికారిక మెమో జారీ చేస్తారు. ఈ విధానం ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీ కౌన్సెలింగ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు అర్హత పొందుతారు. దీంతో ఇకపై దివ్యాంగ విద్యార్థులకు అడ్మిషన్ల సమయంలో ఎలాంటి సాంకేతిక అడ్డంకులు ఉండవు.
ఈ కీలక నిర్ణయం వెనుక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. దివ్యాంగ విద్యార్థులు స్వయంగా మంత్రి లోకేష్‌ను కలిసి తమ సమస్యను వివరించగా, ఆయన వెంటనే స్పందించి అధికారులతో చర్చించారు. విద్యార్థులకు నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా విడుదలైన జీవోతో వేలాది మంది దివ్యాంగ విద్యార్థులకు భవిష్యత్తులో మేలు జరుగనుంది. ఈ నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.