ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. ఐదు జిల్లాల పరిధిలో నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియలో భాగమైన 3ఏ నోటిఫికేషన్ వివరాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగిలిన నాలుగు జిల్లాలకు సంబంధించిన 3ఏ వివరాలకు ఇప్పటికే NHAIతో పాటు రోడ్లు, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. దీనితో ఈ జిల్లాల వరకూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. రాజధాని అభివృద్ధిలో కీలకమైన ఈ ప్రాజెక్టు మరో ముందడుగు వేసిందని అధికారులు తెలిపారు.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును గుంటూరు, కృష్ణా, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నిర్మించనున్నారు. ఈ ఐదు జిల్లాలకు సంబంధించిన 3ఏ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి చేరగా, ఎన్టీఆర్ జిల్లా వివరాలు మినహా మిగతా అన్ని జిల్లాల వివరాలు ఆమోదం పొందాయి. ఎన్టీఆర్ జిల్లా వివరాలకు కూడా ఆమోదం లభించిన వెంటనే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు పత్రికా ప్రకటన జారీ చేయనున్నారు. ఆయా సర్వే నంబర్లలో భూములు కలిగిన వారు అభ్యంతరాలు తెలపగలరు. అభ్యంతరాలు వచ్చినట్లయితే జాయింట్ కలెక్టర్ విచారణ నిర్వహిస్తారు. అభ్యంతరాలు లేకపోతే భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ ప్రతిష్టాత్మక అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును మొత్తం 190 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసలుగా (6 లైన్లు) నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ.24,791 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఐదు జిల్లాల పరిధిలోని 23 మండలాల్లో ఉన్న 121 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. రాజధాని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు, అమరావతి చుట్టూ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అలాగే కోల్‌కతా–చెన్నై నేషనల్ హైవే నుంచి అమరావతి ఓఆర్‌ఆర్‌కు అనుసంధానంగా దక్షిణ, తూర్పు దిశల్లో రెండు లింక్ రోడ్లను కూడా నిర్మించనున్నారు. చెన్నై–కోల్‌కతా నేషనల్ హైవేలో విజయవాడ బైపాస్ ప్రారంభమయ్యే కాజ ప్రాంతం నుంచి తెనాలికి సమీపంలోని నందివెలుగు వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేసింది. మొత్తం 12 ప్యాకేజీలుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించడంతో, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.