వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు అమరావతిపై ఉన్న అక్కసు ఇంకా చల్లారలేదు. ఐదేళ్ల పాలనలో రాజధానిని శూన్యమయ్యేలా చేయాలనే కుట్రలు పన్నినా అవి ఫలించలేదు. “శ్మశానం, ఎడారి, వర్షం పడితే మునిగిపోతుంది” అంటూ మంత్రులు, పార్టీ అనుచరులు ఐదేళ్లూ విషప్రచారమే చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని విడుదల చేయకపోవడం ద్వారా అమరావతిని ముంచేయాలన్న యత్నాలూ జరిగాయి.
ఇప్పుడు మళ్లీ అదే పాత ఆట మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలతో అమరావతి మునిగిపోయిందంటూ జగన్ మీడియా, వైకాపా వర్గాలు మరోసారి నకిలీ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. కొన్ని ప్రభుత్వ ఉద్యోగులే సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్నారు.
వాణిజ్య పన్నులశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎస్.సుభాష్ చంద్రబోస్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులు దీనికి నిదర్శనం. “అమరావతినే ఒక రిజర్వాయర్గా కట్టేస్తే సరిపోతుంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. “ఒకే ఒక్క వర్షం.. అమరావతి జలమయం” అని డ్రోన్ ఫొటోలతో పోస్ట్ పెట్టారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్టులపై అనుచిత వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, అమరావతిపై ద్వేషం పెంచేలా ఉంది.
వాస్తవానికి అమరావతిలో ఎక్కడా నీరు నిల్వ కాలేదు. కొండవీటి వాగు ఎగదన్నంతో తాడికొండ మండలంలో కొద్ది పొలాలు మాత్రమే నీటమునిగాయి. నిర్మాణ పనుల మధ్యలో తవ్విన పునాదుల్లోకి నీరు చేరింది. అదే ఫొటోలను వాడుకుని “అమరావతి మునిగిపోయింది” అని ప్రచారం చేయడం అబద్ధం.
వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం, అదే ఫొటోలను ఉపయోగించడం ఈ దుష్ప్రచారానికి స్పష్టమైన నిదర్శనం. అమరావతి మునగలేదన్న సత్యం తెలిసినా రాజకీయ స్వార్థం కోసం అబద్ధాల ప్రచారం చేయడం వైసీపీ శైలే అని ప్రజలు చెప్పుకుంటున్నారు.