ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆదరణ 3.0 పథకం ప్రారంభించనుంది. ఈ పథకం కింద ముఖ్యంగా కల్లుగీత కార్మికులు మరియు ఇతర కులవృత్తుల వారికి ద్విచక్ర వాహనాలు, ఆధునిక పరికరాలు అందించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు కేవలం 10 శాతం మాత్రమే చెల్లించాలి. మిగతా 90 శాతం రాయితీ ప్రభుత్వమే భరిస్తుంది. ఉదాహరణకు, ఒక బైక్ ధర రూ.1 లక్ష ఉంటే, లబ్ధిదారుడు కేవలం రూ.10 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
గీత కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. వారికి ద్విచక్ర వాహనాలతో పాటు ఆధునిక పరికరాలను కూడా అందించనుంది. అంతేకాకుండా, రంపచోడవరంలో తాటి ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఈ పథకం కింద లబ్ధిదారుల వయసు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి మరియు వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై, బీసీ కులానికి చెందినవారై ఉండాలి.
ఆదరణ పథకం కింద గీత కార్మికులకే కాకుండా ఇతర కులవృత్తుల వారికి కూడా అవసరమైన పరికరాలు అందిస్తారు. ఉదాహరణకు, యాదవ, కురుబలకు పశువుల పెంపకానికి సంబంధించిన పరికరాలు, గౌడ, శెట్టిబలిజలకు ద్విచక్ర వాహనాలు, రజకులకు లాండ్రీ మెషిన్లు, కార్పెంటర్లకు వుడ్ కార్వింగ్ మెషిన్లు, బంగారు పనివారికి ప్రత్యేక యంత్రాలు, నాయిబ్రాహ్మణులకు సలూన్ పరికరాలు, సగ, ఉప్పరలకు వెల్డింగ్, కాంక్రీటు మెషిన్లు వంటి పరికరాలు అందిస్తారు.
ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 2014–2019లో కూడా ఆదరణ పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు మళ్లీ దీనిని విస్తరించి, మరింత మంది లబ్ధిదారులకు చేరువ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా సంప్రదాయ వృత్తులు కొనసాగడమే కాకుండా, ఆ వృత్తుల్లో ఉన్నవారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం నమ్ముతోంది.