నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే వైకాపా (YSRCP) పని అని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. రాజధాని మునిగిపోయిందని.. ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయంటూ సొంత టీవీ, పత్రికలు, అనుబంధ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 'సుపరిపాలనలో తొలి అడుగు', పార్టీ కమిటీల నియామకం తదితర అంశాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైకాపా దుష్ప్రచారంపై స్పందించారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు.
“రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఊళ్లు మునుగుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాజధాని కోసం పొన్నూరును ముంచారని ఒకసారి వార్త వేశారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పనిచేయడం లేదని మరోసారి ప్రచారం చేశారు. ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడిందని ఓ సారి వార్త వేశారు. తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించాలని వైకాపా యత్నిస్తోంది.
వీటిని ఎప్పటికప్పుడు ఖండించాలి. ఈ విషయంలో మంత్రులు, పార్టీ నేతలు చొరవ చూపాలి. ఖండించకపోతే తప్పుడు ప్రచారాలనే నిజం అనే స్థాయికి తీసుకెళ్తారు. మంచి గురించే కాదు.. చెడు చేసేవారి గురించీ ప్రజలను చైతన్య పరచాలి. రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను కట్టడి చేసే విషయంలో కఠినంగా ఉంటాం.
ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నాయకుడు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి. అసత్య ప్రచారాలను దృష్టిలో పెట్టుకుని మరింత క్రమశిక్షణతో ఉండాలి. మీ మాట, చర్య ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉండకూడదు. ఏ ఒక్కరూ వివాదాలకు ఆస్కారం ఇవ్వకూడదు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల కోసం నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్నాం.
ఇతర పదవుల భర్తీ కూడా త్వరలోనే చేపడతాం. పార్టీ కమిటీలను సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరుకు పూర్తిచేయాలి. పులివెందుల, ఒంటిమిట్టలో విజయానికి కృషి చేసిన నేతలకు అభినందనలు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కూటమి అభ్యర్థులు గెలవాలి" అని చంద్రబాబు అన్నారు.