ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఇప్పటివరకు తక్కువ ధరకే అందుబాటులో ఉన్న రోజువారీ 1జీబీ డేటా ప్లాన్లను నిలిపివేసింది. దీంతో జియో బేసిక్ రీఛార్జ్ ఆప్షన్ల రూపం మారిపోయింది.
ఇంతకాలం జియోలో రూ.209 (22 రోజులు), రూ.249 (28 రోజులు) వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న రోజుకు 1జీబీ డేటా ప్లాన్‌లు ఎక్కువ ఆదరణ పొందాయి. కానీ, తాజాగా కంపెనీ వీటిని పూర్తిగా నిలిపివేసింది. దీంతో వినియోగదారులకు రోజువారీ డేటా ప్లాన్‌లలో కనీస ఆప్షన్‌గా రూ.299 ప్లాన్ మాత్రమే మిగిలింది.
ఈ కొత్త ప్లాన్‌లో 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. అంటే ధర పెరిగినప్పటికీ, యూజర్లకు డేటా పరిమితి పెరిగింది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్, రీల్‌లు, గేమింగ్ వంటి వాటికి ఎక్కువ డేటా వాడే వారికి ఇది ప్రయోజనకరంగా మారవచ్చు.
ఇక ధరలు పెరుగుతున్నప్పటికీ జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. జూన్ నెలలోనే కంపెనీ 19 లక్షల కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఇది ప్రధాన పోటీదారు ఎయిర్‌టెల్ వృద్ధికి రెట్టింపు. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా (Vi), బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను కోల్పోయాయి.