రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం గురించి తాజాగా లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకం పరిమితులు, విధానాలపై స్పష్టతనిచ్చారు.
ప్రస్తుతం ఈ పథకం కింద భూమి కలిగిన రైతులకు మాత్రమే ఆర్థిక సహాయం అందుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని కౌలుదారులకు కూడా వర్తింపజేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా మంత్రి పేర్కొన్న విషయాలు ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.
మంత్రి స్పష్టంగా తెలిపారు – పీఎం కిసాన్ పథకాన్ని విస్తరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. కౌలుదారులకోసం ఈ పథకాన్ని వర్తింపజేయడం, లేదా ఆర్థిక సాయాన్ని పెంచడం గురించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం లేదని పేర్కొన్నారు. భూమిని స్వయంగా కలిగి ఉన్న రైతులకే ఈ పథకం వర్తిస్తుందని తేల్చిచెప్పారు.
ఇప్పటివరకు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.3.9 లక్షల కోట్లను 20 విడతలుగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇది రైతుల ఆదాయాన్ని స్థిరపర్చడంలో, అత్యవసర ఖర్చులకు కొంత ఉపశమనంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, చాలా రాష్ట్రాల్లో కౌలుదారులు (ఇద్దికొనిన భూములపై వ్యవసాయం చేసే వారు) పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు కూడా పీఎం కిసాన్ లాంటి పథకాల వల్ల లబ్ధి పొందాలనే డిమాండ్ వుంది. కానీ ఇప్పటికైతే కేంద్రం ఆ దిశగా ఆలోచించకపోవడం వారిలో నిరాశను కలిగించవచ్చు.
రైతులు (Formers) ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సవాళ్ల మధ్య, పీఎం కిసాన్ వంటి పథకాలు ఒక మద్దతు రూపంగా ఉన్నా, వాటి పరిమితులు ఇప్పుడు మరింత స్పష్టంగా వెల్లడయ్యాయి. భవిష్యత్‌లో ప్రభుత్వం ఈ అంశాలపై తన వైఖరిని మార్చుతుందేమో చూడాలి.