దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు తెగబడే అవకాశం ఉన్నందున, దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య ఈ ముప్పు ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో (BCAS) అన్ని విమానాశ్రయాలకు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. రన్‌వేలు, హెలీప్యాడ్స్, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లు తదితర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.
దీంతో అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా, పెరిమీటర్ జోన్ వంటి కీలక ప్రాంతాల్లో గస్తీ పెంచారు. స్థానిక పోలీసులతో కలిసి విమానాశ్రయాల వద్ద వాహనాలను, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. విమానాశ్రయ సిబ్బంది, కాంట్రాక్టర్లు, సందర్శకులు కూడా భద్రతా తనిఖీలకు లోబడతారని అధికారులు స్పష్టం చేశారు.
ఇక ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.