థాయ్‌లాండ్ మరియు కంబోడియా దేశాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మళ్లీ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ వివాదానికి కేంద్రంగా ఉన్నది ప్రాచీన హిందూ దేవాలయం ప్రేహ విహార్. ఇది రెండు దేశాల సరిహద్దులో ఉన్న కొండపై నెలకొంది. ఈ ఆలయం 2008లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తింపు పొందింది. అయితే, ఆలయాన్ని చుట్టూ ఉన్న భూమిపై యాజమాన్య హక్కుల విషయంలో ఇరుదేశాలు విభేదిస్తున్నాయి.
ఈ వివాదం కారణంగా ఇరుదేశాల మధ్య కాల్పులు చెలరేగి, దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ప్రజలు తమ నివాసాలు వదిలి శరణు వెతుకుతున్నారు. థాయ్‌లాండ్ అమెరికా ఆయుధాలతో బలంగా ఉన్నా, కంబోడియా మాత్రం పాత చైనా, రష్యా ఆయుధాలతో పోరాడుతోంది. మలేషియా మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఈ అంశంపై స్పందించింది.
ఇక రాజకీయంగా కూడా ఈ వివాదం ప్రభావం చూపింది. థాయ్‌లాండ్ ప్రధాని పాయటోంగ్తాన్‌ను తాత్కాలికంగా పదవి నుంచి తొలగించారు. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో ఆమె ఫోన్ సంభాషణ లీక్ కావడంతో దుమారం రేగింది. భారత్ ఈ వివాదంలో తటస్థంగా వ్యవహరిస్తూ, ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కారం కోరుకోవాలని విజ్ఞప్తి చేసింది.