కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంగా వరుసగా నాలుగు రోజులుగా రాజకీయ ఉద్రిక్తతలు ఊపందుకున్నాయి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై పోలీసులు నాలుగు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
గత బుధవారం నల్లగొండవారిపల్లె గ్రామంలో ఈ రెండు పార్టీలకు చెందిన వర్గాలు ఢీకొన్నాయి. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన ధనుంజయ అనే కార్యకర్తను కుల ప్రస్తావన చేస్తూ దాడి చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రి సహా 50 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయింది.
అదే గ్రామంలో మరో కేసు కూడా నమోదైంది. వైసీపీ నాయకుడు రామలింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు జయభారత్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి సహా 16 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇక అదే రోజు ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా అనుమతి లేకుండా ర్యాలీ చేసినట్టు ఎంఫీడీవో కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, ఇతర 150 మందిపై కేసు నమోదైంది.
ఇక టీడీపీలోకి చేరిన విశ్వనాథ్ రెడ్డిని ఫోన్‌లో బెదిరించినట్టు ఆరోపణలపై వైసీపీ నేతలు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ పీఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లి గంగాధర్ రెడ్డిలపై మరో కేసు నమోదు అయింది.