అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని పరిణామం చోటు చేసుకోనుంది. దాదాపు 250 ఏళ్లలో తొలిసారి ఆ దేశ జనాభా తగ్గనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఈఐ) తాజా నివేదిక ప్రకారం, 2025లో జనాభా క్షీణత తప్పదని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం అమెరికాకు వచ్చే వలసలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ఏడాదిలో వలసదారుల సంఖ్య 5.25 లక్షలకు తగ్గవచ్చని అంచనా. మరోవైపు జననాల రేటు కూడా తీవ్రంగా పడిపోగా, గతేడాది కేవలం 5.19 లక్షల పుట్టిన పిల్లలే నమోదయ్యారు. ఈ లెక్కల ప్రకారం 2025లో సుమారు 6,000 మంది వరకు జనాభా తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో అంతర్యుద్ధం (సివిల్ వార్), కరోనా మహమ్మారి వంటి విపత్కర సమయాల్లో కూడా జనాభా పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాబోయే 30 ఏళ్లలో అమెరికా జననాల రేటు 1.6 వద్దే నిలిచిపోతుందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ (ఐఎఫ్‌ఎస్) అంచనా వేసింది. ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే 2.1 జననాల రేటు అవసరం.
ఇదిలా ఉండగా, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాత సుమారు 20 లక్షల మంది వలసదారులు అమెరికాను వీడటం కూడా ఈ క్షీణతకు ఒక ప్రధాన కారణంగా నిలిచింది. మొత్తంగా, తగ్గిన వలసలు, పడిపోయిన జననాలు కలిసి అమెరికా చరిత్రలోనే తొలిసారి జనాభా క్షీణతను తెస్తున్నాయి.