అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక టారిఫ్‌లతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తుతున్నాయి. ప్రత్యేకంగా రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తున్న ట్రంప్, ఆ దేశంతో వ్యాపార సంబంధాలు పెట్టుకునే దేశాలపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై కూడా ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్‌లను విధించారు. మొదట 25 శాతం మాత్రమే పెంచుతారని అనుకున్నా, తరువాత మరో 25 శాతం పెంచడంతో మొత్తం 50 శాతం భారాన్ని భారత్ భరించాల్సి వచ్చింది.
ఈ టారిఫ్ నిర్ణయం భారత్‌కు ఆర్థికంగా పెద్ద సవాలుగా మారింది. అమెరికా వైపు నుంచి వచ్చిన ఈ ఒత్తిడి నేపథ్యంలో భారత్, చైనా, రష్యాలతో సంబంధాలను మరింత బలపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాను సందర్శించి, అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌తో సమావేశం కావడం అంతర్జాతీయ వర్గాల్లో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం భారత్-అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంతలోనే ప్రధాని మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో జరగబోయే ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశాలకు తాను హాజరు కాకుండా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌ను పంపాలని నిర్ణయించారు. భారత్ తరఫున జైశంకర్ ప్రాతినిధ్యం వహించి సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి హాజరవ్వడానికి ఆయన 27వ తేదీన న్యూయార్క్‌కు బయలుదేరే అవకాశం ఉంది. మోదీ గైర్హాజరు కావడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని మోదీ చివరిసారిగా 2021లో ఐరాస సర్వసభ సమావేశాలకు హాజరయ్యారు. అయితే, గత ఏడాది ఆయన న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినా, అది సాధారణ సమావేశం కోసం మాత్రమే. అంతకుముందు 2022లో "సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్"లో పాల్గొని ప్రసంగించారు. 2022 నుండి జైశంకరే యునైటెడ్ నేషన్స్ సమావేశాల్లో భారత్ తరఫున హాజరవుతున్నారు. మోదీ తన 11 ఏళ్ల పదవీకాలంలో నాలుగు సార్లు (2014, 2019, 2020, 2021లో) యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మిగతా సార్లు సుష్మా స్వరాజ్, జైశంకర్ ప్రాతినిధ్యం వహించారు.
ఈ పరిణామాల మధ్య భారత్-అమెరికా సంబంధాలు ఏ దిశగా పయనిస్తాయో చూడాలి. ఒకవైపు ట్రంప్ టారిఫ్‌లతో ఒత్తిడి పెంచుతుండగా, మరోవైపు భారత్ ఇతర శక్తివంతమైన దేశాలతో స్నేహాన్ని బలపరుస్తోంది. అంతేకాకుండా, ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సమ్మిట్ కోసం ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే, రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.